ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఐదో సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందనుకంటున్న సమయంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కొండంత బలాన్నిచ్చాయి. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసింది. తెలుగుదేశం పార్టీకి ఎదురులేదనే వాతావరణాన్ని సృష్టించింది. ఆ తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుని పోరాటయాత్ర చేస్తున్నారు. అంటే నాలుగేళ్లలో టీడీపీ మిత్రులను వదులుకుని ఒంటరిగా నిలబడిందన్నమాట.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతుంది. తెలుగుదేశం ఎన్డీఎలో కలిసి ఉన్న సమయంలో ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించింది. ప్యాకేజీకి నాలుగో బడ్జెట్ లో కూడా రూపాయి కూడా కేటాయింకపోవడంతో బయటకు వచ్చేసి పోరాటం ప్రారంభఇంచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ లు ఇద్దరూ బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నారని టీడీపీ పదేపదే ఆరోపిస్తుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోక్ నీతి, ఎబీపీ సంయుక్త సర్వేలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పై పెరుగుతున్న వ్యతిరేకత, తెలుగుదేశానికి అనుకూలంగా మారుతుందని తేల్చాయి.
ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ను ప్రకటించడం, జనసేన అధినేత కళింగాంధ్రా ఉద్యమం వస్తుందని హెచ్చరించడం, రమణదీక్షితులు వివాదం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన ప్రతి అవకాశాన్ని బీజేపీపై విరుచుకుపడేందుకు ఉపయోగించుకుంటున్నారు. జగన్, పవన్ ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కూడా చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి రాబోయే ఎన్నికల చిత్రాన్ని ప్రజలకు ముందుగానే గుర్తు చేస్తున్నారు.
నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది.రాజధాని నిర్మాణానికి ఇంకా పనులు ప్రారంభం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ లోపాలన్నింటినీ అధిగమిస్తూ.. రాజకీయసవాళ్లను పరిష్కరించుకుంటూ.. మరో ఏడాది చంద్రబాబు యుద్ధం చేయాల్సి ఉంది.