నటసింహ నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రం కోసం హిందీ నుంచి చిరంతన్ భట్ అనే సంగీత దర్శకుణ్ణి తెచ్చారు. చారిత్రక కథకు తగ్గట్టు ఆయన చక్కటి సంగీతాన్ని అందించారు. బాలకృష్ణకు అతడి పనితీరు నచ్చడంతో ‘జై సింహా’ చిత్రానికి అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్‌కీ చిరంతన్ భట్ సంగీత దర్శకుడని ప్రకటించారు. ఒక్క చిత్రం అతడికి రెండు అవకాశాలు తెచ్చింది. అయితే… శాతకర్ణికి తాను చక్కటి సంగీతాన్ని అందివ్వలేదేమో? తనతో పాటు సిరివెన్నెల సీతారామశాస్త్రి మరింత కష్టపడి పనిచేయలేమో? అని ట్వీటారు. చిరంతన్ భట్ ఇలా ఫీలవ్వడానికి ఓ కారణం వుంది. 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో శాతకర్ణి చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. ఉత్తమ నటుడు విభాగంలో బాలకృష్ణ, ఉత్తమ దర్శకుడిగా క్రిష్ నామినేట్ అయ్యారు. సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్‌కి గానీ, పాటల రచయితగా సిరివెన్నెలలో గానీ నామినేషన్స్ రాలేదు. దాంతో “సంగీతం, సాహిత్యం విభాగాల్లో తప్ప శాతకర్ణి చిత్రానికి చాలా విభాగాల్లో నామినేషన్లు వచ్చాయి. బహుశా… నేను, శాస్త్రిగారు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి” అని చిరంతన్ భట్ ట్వీట్ చేశారు. క్రిష్ అతణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు. “శాస్త్రిగారు, మీరు, డీఓపీ జ్ఞానశేఖర్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా శాతకర్ణికి మూలస్తంభాలు. మీ కాంట్రిబ్యూషన్ వల్ల మిగతా వారికి నామినేషన్స్ వచ్చాయి” అని క్రిష్ పేర్కొన్నారు.