“తెలంగాణ మజ్దూర్ యూనియన్” టీఎంయూ… తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం. తెలగాణ ఉద్యమంలో భాగంగా పురుడు పోసుకున్న సంస్థ. ప్రస్తుత మంత్రి హరీష్ రావు బ్రెయిల్ చైల్డ్. ఆయనే దీనికి గౌరవాధ్యక్షుడు. అంటే.. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘమే ఇప్పుడు ఆర్టీసీని సమ్మెలోకి తీసుకెళ్తోంది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం…అనుబంధ కార్మిక సంఘ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా.. సీరియస్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సమ్మె చేస్తే ఆర్టీసీని మూత వేస్తామని హెచ్చరిస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపు కోసమే యూనియన్ నాయకులు.. ఇప్పుడు సమ్మె పిలుపునిచ్చారని కేసీఆర్ తేల్చేశారు. సొంత ప్రయోజనాల కోసం సంస్థ ఊపిరి తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీని ఆర్టీసీగానే చూసి ఉంటే.. తెలంగాణ ఉద్యమంలో.. ఆ సంస్థను కేసీఆర్ భాగం చేసి ఉండేవారు కాదేమో. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పులకుప్పగా మారిన ఆర్టీసీపై.. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బంద్‌లు, సకలజనుల సమ్మెలు.. తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అప్పటి వరకూ… తమ సంస్థ, తమ కార్మిక సంఘం అన్నట్లుగా ఉన్న కార్మికులందర్నీ తెలంగాణ పేరుతో విడగొట్టేసి.. కొత్త సంఘం పెట్టించేసి.. హరీష్ రావు చేసిన రాజకీయాన్ని ఎవరు మర్చిపోగలరు. ఇప్పుడు ఆ కార్మిక సంఘమే కేసీఆర్‌కు ఏకు మేకై కూర్చుంది.
కార్మికసంఘం కోరేది గొంతెమ్మ కోరికలని కేసీఆర్ చెబుతున్నారు కానీ.. అవన్నీ… వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు. తమ మాతృపార్టీ.. నుంచే కదా..! పోరాడితే తెలంగాణనే వచ్చింది.. తమ సమస్యలు పరిష్కారం కావా అన్న స్ఫూర్తిని నింపింది టీఆర్ఎస్నే కదా..! ఆ టీఆర్ఎస్కే అనుబంధ సంఘంగా ఉన్న కార్మిక సంఘం… బంద్‌ల పేరుతో.. ఉద్యమం చేయడం వింతేమీ కాదు. వ్యవస్థలనే ధిక్కరించిన చేసిన తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన సంస్థలు… వ్యక్తులు, ప్రభుత్వాలకు భయపడతాయని కేసీఆర్ కూడా అనుకోరేమో..? అయినా కానీ కేసీఆర్..బెదిరింపుల పర్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సామరస్యంగా చర్చించి… వారి సమస్యలకు పరిష్కారం చూపించేందుకు చొరవ తీసుకోవడం లేదు.
ఇలాంటి సమస్యలను పరిష్కరించడం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు… టీఎంయూ గౌరవాధ్యక్షుడు హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య. అయినా.. వారెందుకు .. సమస్యను తెగేదాకా లాగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్టీసీని ముక్కలు చేయడానికి ముందస్తు ప్రణాళికలా అన్న అనుమానాలు కూడా కార్మికుల్లో ఉన్నాయి. ఏమైనా కానీ.. ఇప్పుడు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె ప్రయత్నాలకు స్ఫూర్తి కేసీఆర్ అనే చెప్పక తప్పదు. ఆయన నేర్పిన విద్యను.. ఆయన ముందే ప్రదర్శిస్తున్నాయి.. కార్మిక సంఘాలు.