ప్రస్తుతం `సాహో`తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఆ వెంటనే `జిల్` దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా పట్టాలెక్కిస్తారు. ఇది కూడా యూవీ క్రియేషన్స్ సంస్థలోనే తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే… ఈ సినిమా శ్రీకారం నుంచి శుభం కార్డు వరకూ యూరప్‌లోనే జరగబోతోందట. కథా నేపథ్యం యూరప్ కి సంబంధించినదని తెలుస్తోంది. కథ మొత్తం అక్కడ జరిగినట్టే చూపిస్తారు. మిగిలిన దేశాల్లో షూటింగ్ చేసినా.. అది మ్యాచింగ్ సీన్లే. ఇండియాలోనూ చిత్రీకరణ జరుగుతుంది. కాకపోతే అది కేవలం సెట్ వర్క్ మాత్రమే. ఈ పాటికే ఈ సినిమా మొదలు కావల్సింది. కానీ జులై – ఆగస్టులలో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. ఓ వైపు సాహో.. మరోవైపు రాధాకృష్ణ సినిమా రెండూ సమాంతరంగానే షూటింగ్ జరుపుకోబోతున్నాయి. హస్త సాముద్రికం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ ఇలాంటి జోనర్లో ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. 2019 చివర్లో ఈ సినిమా విడుదల అవుతుంది.