డిల్లీలో జరుగనున్న గణతంత్రదినోత్సవ వేడుకలో విద్వంసం సృష్టించేందుకు ముగ్గురు తీవ్రవాదులు ఒక టాక్సీలో డిల్లీలో ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. జనవరి 20వ తేదీన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పఠాన్ కోట్ లో గగ్గల్ అనే ప్రాంతానికి చెందిన ఒక టాక్సీ (నెంబర్: హెచ్.పి. 01డి-2440) ని అద్దెకు తీసుకొని డిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. దారిలో ఆ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్ హత్య చేశారు. అతని శవం కంగ్డా జిల్లాలో కలత బ్రిడ్జ్ సమీపంలో పడేశారు. ఈ విషయం తెలుసుకొన్న డిల్లీ పోలీసులు అన్ని ప్రధాన కూడళ్ళలో శోదాలు నిర్వహిస్తున్నారు.
ఇది కాక ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆనంద్ స్వరూప్ ఉపయోగిస్తున్న తెల్లరంగు టాటా సఫారి వాహనాన్ని రెండు రోజుల క్రితం నోయిడాలో సెక్టార్-23లో ఆయన నివాసం నుండి ఎవరో దొంగిలించారు. పఠాన్ కోట్ నుంచి హైజాక్ చేయబడిన టాక్సీ వివరాలను ట్వీటర్ లో పోస్ట్ చేసి ప్రజల సహాకారం కోరుతున్నారు. ఉగ్రవాదులు పఠాన్ కోట్ నుంచి నోయిడా చేరుకొన్న తరువాత ఇన్స్పెక్టర్ జనరల్ ఆనంద్ స్వరూప్ వాహనాన్ని దొంగలించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పఠాన్ కోట్ దాడికి ఉగ్రవాదులు ఇదే విధంగా చేయడంతో, డిల్లీ పోలీసులు రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి డిల్లీలో తిరుగుతున్న పోలీస్ వాహనాలతో సహా లక్షలాది వాహనాలను దీనిని విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా తనికీలు చేస్తున్నారు.