పవన్ కల్యాణ్‌కు ఉన్న వీర భక్తుల్లో షకలక శంకర్ కూడా ఒకడు. ఈమధ్య ఆయన కూడా ఎర్ర కండువా వేసుకుని అభిమానుల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నాడు. హీరోగా మరి చేస్తున్న తొలి సినిమా `శంభో శంకర` టీజర్లో పవన్‌పై తనకున్న ప్రేమని, అభిమానాన్నీ, వాత్సల్యాన్నీ అన్నింటికంటే పిచ్చినీ కంబైన్డ్‌గా చూపించేశాడు శంకర్. ఓ సీన్లో, ఏ షాట్లో చూసినా పవన్‌ని ఇమిటేట్ చేస్తున్నట్టే అనిపిస్తోంది. పవన్‌ని ఆరాధించడంలో తప్పులేదు. అనుకరించడమేమిటి? అలా అనుకరిస్తే జబర్ దస్త్కీ, సినిమాకీ ఉన్న తేడా ఏమిటి? జబర్దస్త్‌లో పవన్‌ని చాలాసార్లు అనుకరించాడు శంకర్. ఇప్పుడు వెండి తెరపై అనుకరిస్తున్నాడంతే తేడా. హీరోగా మారడమే పెద్ద రిస్కు. అలా మారితే…. తన సొంత తడాఖా చూపించాలి. తన మార్క్ బయటకు తీసుకురావాలి. ఇవన్నీ వదిలేసి వేరే వాళ్ల ఫ్యాంటూ షర్టుల్లో దూరిపోతానంటే ఎలా? పవన్‌ని అనుకరించడానికి చాలామంది ఉన్నారు. వాళ్లలో షకలక శంకర్ ఒకడిగా మారిపోతాడంతే. హీరోగా శంకర్ ఏం చేస్తాడో అని ఆశగా వస్తున్న ప్రేక్షకులకు శంకర్ ఏం చూపిస్తున్నట్టు? కొంతమంది పవన్ అభిమానుల్ని ఆకట్టుకోవడానికైతే ఈ స్టఫ్ ఓకే. అందరినీ మెప్పించాలంటే మాత్రం కుదరదు. పవన్‌కి పేరడీలాంటి సినిమా తీస్తే.. అందులో హీరోయిజం ఎలా కనిపిస్తుంది శంకరా.. కాస్త ఆలోచించు.