భారతీయ జనతా పార్టీ సినిమా అయిపోయిందా..? నాలుగేళ్లకే ఆ పార్టీ అరవై శాతం సీట్లను కోల్పోయేంత అసంతృప్తి మూటగట్టుకుందా..? అవుననే అంటోంది ఓ సర్వే. ఇది బీజేపీ వ్యతిరేక మీడియా సంస్థ చేసింది కాదు..సాక్షాత్తూ బీజేపీ అంతర్గత సర్వే. ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ దీన్ని బయటపెట్టింది. బీజేపీ నేతలెవరూ దీనిపై ఖండన ప్రకటనలు కూడా చేయకపోతూండటంతో.. నిజమేనని జనం కూడా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 సీట్లలో ఓడిపోయే అవకాశాలున్నాయి. అంటే ఆ పార్టీకి నికంగా 130 సీట్లు మాత్రమే వస్తాయి. ఉత్తరాదిలో ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకకతను ఎదుర్కొంటోందని తేలింది. బీజేపీ విజయానికి బాటలు వేసిన ఉత్తర ప్రదేశ్ లో గత ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడ 48 సీట్లు కోత పడబోతున్నాయని సర్వేలో తేలింది. అలాగే గత ఎన్నికల్లో ఏక పక్ష విజయాలు వమోదు చేసి… రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లో ఈసారి అత్యంత భారీగా నష్టపోనుంది. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన ఆరాష్ట్రాల్లో ఈ సారి పూర్తిగా పరిస్థితి తిరగబడుతోంది. అన్ని చోట్లా సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే… వస్తాయని ఆ పార్టీ చేయించుకున్న సర్వేలో తేలింది.
మొత్తానికి హిందీ బెల్ట్ తెగిపోవడం ఖాయమవడంతో…. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి ఈ సారి బీజేపీకి ఉంటుదని తేలింది. ఈ సర్వే వివరాలు షాక్ ఇవ్వడంతోనే.. మూడు నెలలుగా అమిత్ షా ఆరెస్సెస్ తో ఉన్న పళంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో మిత్రులను మళ్లీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు నెలల కిందటే ఈ సర్వే అందడంతో అప్పటి నుంచే.. పార్టీ వ్యూహాన్ని కూడా.. బీజేపీ మార్చుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది నరేంద్రమోదీని ఒడిషాలోని పూరి నుంచి బరిలోకి దింపాలని ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.
ఇటీవలి కాలంలో వరుసగా…ఉపఎన్నికల్లో బీజేపీకి ఓటములు ఎదురవుతన్నాయి. కంచుకోటల్లాంటి ప్రాంతాల్లో భారీగా ఓటు బ్యాంక్ పడిపోయింది. విపక్షాలు ఏకమవడంతో.. కనీసం గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. ఉత్తరాదిలో సీట్లు తగ్గితే దక్షిణాదిలో పెంచుకుంటామని.. ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ఆ పార్టీకి ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే ఎక్కువ వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ఆ పార్టీ చేసిన రాజకీయాలతో వ్యతిరేకత మరింత పెరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కలసి పోటీ చేస్తే… బీజేపీకి గడ్డు పరిస్థితి ఖాయం. ఏపీ , తెలంగాణలో డిపాజిట్లు దక్కడమూ కష్టమే. 2014లో ప్రతిపక్షాలను బీజేపీ తుడిచి పెట్టేస్తే.. ఇప్పుడు ప్రతిపక్షాలు.. బీజేపీని తుడిచి పెట్టేయబోతున్నాయని… ఆ పార్టీ అంతర్గత సర్వేలోనే తేలడం.. దేశ రాజకీయాల్లో కచ్చితంగా సంచలనాత్మకమే.
సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు నిరాకరించి.. కొత్త వాళ్లని బరిలోకి దింపడం సహా.. బీజేపీ అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. తమ పరిస్థితి దారుణంగా ఉందని తెలియడంతోనే కొత్తగా బీజేపీ.. రాజకీయ క్రీడలు ప్రారంభించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.అనూహ్యంగా ఒక్క రోజు ముందే పుణె పోలీసులు… ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేశారని.. వివరాలు లీక్ చేశారు. ఏకంగా ప్రధాని హత్యకు కుట్ర చేస్తే…సాధారణ పోలీసులు బయటపెట్టడమేమిటని.. పీఎం భద్రతను పర్యవేక్షించేవారు.. ఇతర కేంద్ర సంస్థలు ఎందుకు విచారణ చేయలేదని… విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదందా.. సర్వే ఎఫెక్టే కావొచ్చు. మొత్తానికి బీజేపీ పరిస్థితి మాత్రం..డౌన్ ట్రెండ్ లోనే ఉందని తేలిపోయింది.