“ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పిచ్చోడు, పొట్టోడు, లావుగా ఉంటాడు” ఈ మాటలన్నది.. ఎవరో భావోద్వేగాలు అణుచుకోలేని అమెరికన్ కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ” ట్రంప్ ఒక వృద్ధుడు, ఆయనకు మతి భ్రమించింది..ఆయన వల్ల ఏం అవుతుంది” ఈ మాటలన్నది అమెరికాను వ్యతిరేకిచేందుకు సామాన్యపౌరుడు కాదు.. ఉత్తరకొరియాను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నియంత కిమ్. వీరిద్దరి మాటల దాడి చూసిన ఇతర దేశాల అధ్యక్షులు భయపడిపోయారు. చిత్తచాంచల్యం ఉన్న వీరిద్దరూ.. ఏ అర్థరాత్రో ఆవేశం తెచ్చుకుని ఒకరిపై ఒకరు అణుబాంబలేసుకుంటారేమోనని భయపడిపోయారు. రెండు దేశాలూ…. యుద్ధానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. యుద్ధమేఘాలు అలుముకున్నాయి. హైడ్రోజన్ బాంబులేయబోతున్నామని… ఉత్తరకొరియా ప్రకటించింది కూడా. తర్వాత పరిస్థితి చల్లబడింది.
ఇప్పుడు ఏకంగా ఇద్దరూ ముఖాముఖి భేటీకి సిద్ధమయ్యారు. ఇదే ఆశ్చర్యకర పరిణామం. కిమ్ – ట్రంప్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చేది అణ్వస్త్ర నిరాయుధీకరణే. ఉత్తర కొరియా అణ్వస్త్ర రహితంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తేనే భేటీ అవుతానని గతంలో ట్రంప్ చెప్పారు. దానికి తగ్గట్లే సమావేశపు ఎజెండా ఉండనుంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ కాలమానం ప్రకారం ఈ నెల 12న ఉదయం 9 గంటలకు సమావేశం కానున్నారు. భేటీకి ముందు కిమ్‌కు కొన్ని హెచ్చరికల్లాంటి వ్యాఖ్యలు చేశారు ట్రంప్. సింగపూర్ భేటీ కిమ్‌కు ఉన్న ఏకైక అవకాశం అని ట్రంప్ హెచ్చరించారు.
కిమ్ జొంగ్ ఉన్ తన దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాడని… అందుకోసం ఆయనకు అవకాశం లభించిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇంత కంటే మంచి అవకాశం మళ్లీ రాదని కిమ్‌కు హెచ్చరికలాగా సందేశం పంపారు. కీడెంచి మేలెంచాలన్నట్లుగా సమావేశం విఫలం కావడానికి అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. ట్రంప్‌కు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో కిమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గరు. కానీ ఇప్పుడు ట్రంప్‌పై మాటల యుద్ధానికి సిద్దపడలేదు.
ఉత్తరకొరియాకు చెందిన అత్యున్నత అధికారుల బృందం ఇప్పటికే సింగపూర్ చేరుకుంది. సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అసాధ్యమనుకున్న అమెరికా – ఉత్తరకొరియా అధ్యక్షుల సమావేశం.. సాధ్యం కావడం ఇప్పటికీ అనేక దేశాలు నమ్మలేకపోతున్నాయి. ప్రపంచ శాంతి, అణ్వస్త్ర నిరాయుధీకరణకు ఇది మంచి అవకాశం . కానీ ఇద్దరూ.. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని వారే. ఇద్దరూ ఆధిపత్యం కోసం వెంపర్లాడేవాళ్లే. ఉత్తరకొరియా అంతర్గత విషయాల్లో… ట్రంప్ వేలు పెట్టాలని చూస్తే మాత్రం .. సమావేశం మొదట్లోనే తేలిపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ విషయాలపై చర్చిస్తే మాత్రం కనీసం టై అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే… రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే.. ఇద్దరి తిక్కకీ లెక్క ఉండదు కాబట్టి…!