నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ‘యన్.టి.ఆర్’. ఆయన తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో, వెండితెరపై తండ్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ సినిమాలో ఎన్టీఆర్ వారసులు, ముఖ్యంగా ఆయన మనవలు ఎవరైనా నటిస్తారా? లేదా? అనే ఆసక్తి అందరిలోనూ వుంది. కొన్ని రోజులు ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ చైతన్యరథ సారథిగా హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నటించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కళ్యాణ్‌రామ్ స్పందించాడు. ఎన్టీఆర్ బయోపిక్‌కి ముందుగా దర్శకత్వ బాధ్యతలను తేజకి అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన ఓసారి కళ్యాణ్‌రామ్‌ని బయోపిక్‌లో ఓ పాత్ర చేయమని అడిగార్ట. తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ “ఇప్పుడు తాతగారి బయోపిక్ సమీకరణాలన్నీ మారిపోయాయి కదా! ఏం జరుగుతుందో నాకు తెలీదు. అందులో నటించమని ఇప్పటివరకూ నన్ను ఎవరూ అడగలేదు. ఒకసారి తేజగారు ‘బయోపిక్‌లో నువ్వు ఒక రోల్ చేయాలి’ అన్నారు. అయితే.. ఆ పాత్ర ఏమిటో ఆయన చెప్పలేదు. ఇప్పుడు దర్శకుడు మారారు కదా!” అన్నారు. అదండీ సంగతి. ఎన్టీఆర్ మనవాళ్లల్లో ఒకరైన కళ్యాణ్‌రామ్‌కి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిందన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌కి దర్శకత్వం వహించనున్న క్రిష్ ఎన్టీఆర్ వారసుల చేత ప్రత్యేక పాత్రలు ఏవైనా చేయిస్తారో? లేదో?