ఏపీకి భాజపా ఎంతో చేసింది! ఎంత చేసిందంటే… ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేసింది. మిగిలిన 15 శాతం కూడా సమీప భవిష్యత్తులో పూర్తి చేస్తుంది. ఆంధ్రా భాజపా నేతలు కొన్ని నెలలుగా చెబుతున్నది ఇదే. వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రజల్లోకి ప్రచారంగా తీసుకెళ్దామని అనుకుంటున్న అంశం ఇదే! విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కార్యర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడానికి ఎలాంటి అంశాలను ప్రచారం చెయ్యాలనేదీ చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు ఎవ్వరూ భయపడొద్దనీ, ప్రధాని మోడీపై వ్యక్తిగత దూషణలకు మాత్రమే చంద్రబాబు పరిమితం అవుతున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. తానొక్కడినే నిజాయితీపరుడననీ, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అజెండాతో ప్రచారానికి సీఎం సిద్ధపడుతున్నారనీ, దీన్ని తిప్పికొట్టాలనీ, అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రాకు ఎక్కువగా కేంద్రం నిధులు ఇచ్చామని ప్రజలకు వివరించాలన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుపై ఇప్పటికే ఎంపీ హరిబాబు పుస్తకం ద్వారా తెలిపారని చెప్పారు. సబ్జెక్ట్ పరంగా ఏ స్థాయిలోనూ సమాధానాలు చెప్పరని సీఎంని ఉద్దేశించి లక్ష్మీనారాయణ విమర్శించారు.
సబ్జెక్ట్ అంటే ఏంటి…? ఆంధ్రాకు కేంద్రం చేసిన సాయమే కదా! ప్రత్యేక హోదా, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం, పోలవరం నిధుల విడుదల జాప్యం.. ఇలా చెబుతూ పోతే ఓ 18కి పైగా ఉన్నాయి. మొదట్నుంచీ ఏపీ అధికార పార్టీ అడుగుతున్నవి ఇవే. వీటిపై కేంద్ర స్పందన కరువైందనే కదా బాధంతా! వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కానీ, 85 శాతం హామీల అమలు జరిగిపోయాయంటారు. ఆ 85 శాతంలో ప్రధానమైన డిమాండ్లు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల్లో కొన్నైనా ఉండాలి కదా! ఏపీ భాజపా నేతలందరూ ఎప్పుడూ ఆ అంకె చెబుతారేగానీ… హామీలవారీగా ఇదిగో ఫలానా ఫలానా హామీలు పూర్తిచేశామంటూ ఒక్కోటిగా వివరంగా చెబితే బాగుంటుంది! సబ్జెక్టుపరంగా ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది భాజపా. ఇక, వ్యక్తిగత విమర్శలంటారా… ఏపీ ముఖ్యమంత్రి విషయంలో భాజపా చేస్తున్నదే అది. ముఖ్యమంత్రి లక్ష్యంగానే ఆరోపణలూ, విమర్శలూ, బెదిరింపులూ చేస్తున్నది భాజపా నేతలే. ఆంధ్రాకు ఎందుకు సాయం చెయ్యరనేకదా ఏపీ అడుగుతున్నది..?