తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య ప్రస్తుతానికి ఒక కొలీక్కి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జులై నుంచి కార్మికులకు 16 శాతం ఐ.ఆర్. ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఒక దశలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆగ్రహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను కాదని సమ్మెకు దిగితే.. ఎస్మా ప్రయోగిస్తామనీ, కేసులు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు వినిపించాయి. ఉద్యోగులపై వరాలు కురిపించిన ముఖ్యమంత్రి, ఆర్టీసీ కార్మికుల దగ్గరకు వచ్చేసరికి ఇంత కఠినంగా వ్యవహరించడం చర్చనీయమైంది. అయితే, ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చిందనే చెప్పాలి. కానీ, అలాంటి అభిప్రాయం ఎక్కడా రాకుండా.. ఇదంతా కార్మిక పక్షపాతి అయిన కేసీఆర్ క్రెడిటే అన్నట్టుగా ప్రెజెంట్ చేసేందుకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు బాగా ప్రయాసపడ్డారని చెప్పొచ్చు!
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసి, కార్మికులకు ప్రజలకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఒక స్పష్టమైన ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన కార్మిక పక్షపాతిగా నిరూపించుకున్నారని చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, గతంలో ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిల్మెంట్ అడిగితే.. 44 శాతం ఇచ్చి వారి మనసు గెలుచుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. అసంఘటిత రంగ కార్మికులతో సహా అందరి సంక్షేమం కోసం కూడా కేసీఆర్ ఆలోచిస్తారని పలుమార్లు తనదైన చెరగని ముద్రని వేసుకున్నారని వివరించారు! ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ, కార్మికులపై ఆయనుకున్న అవ్యాజ్యమైన ప్రేమతో ఈ సమస్యపై మంత్రులతో చర్చలు చేయించారన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారన్నారు. ఆరువేల మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ పెట్టినప్పుడు, దానికి సంబంధించిన ఆర్డర్లు బి.హెచ్.ఇ.ఎల్.కి ఇచ్చారన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేస్తూ మూసివేసే దిశగా ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఫిట్మెంట్ తోపాటు, ఆర్టీసీని దీర్ఘకాలం లాభాల్లో నడిపించేందుకు అవసరమైన సంస్కరణల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారని చెప్పారు.
మంత్రులిద్దరి ప్రయాస ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమౌతోంది. ఆర్టీసీ సంఘాలు సమ్మె అనగానే.. కేసీఆర్ ఒంటికాలిపై లేచారు. సంస్థ మూడు ముక్కలైపోతుందని కూడా భయపెట్టారు! సో.. ఈ రేంజిలో తీవ్రంగా స్పందించప్పుడు… గతంలో ఎంత కార్మిక పక్షపాతి ముద్ర బలంగా వేయించుకున్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల్లో ముఖ్యమంత్రి వైఖరిపై కొంత చర్చ జరిగిన మాట వాస్తవం. సో… ఆర్టీసి విషయంలో ప్రభుత్వం ఎలాగూ దిగొచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రులిద్దరూ పదేపదే కేసీఆర్ కార్మిక పక్షపాతి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటారని చెప్పడం వెనక ఉన్న ముందుజాగ్రత్త ఏంటనేది అర్థమౌతూనే ఉంది కదా.