“యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్”(హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ విషాదాంతం ఒక విస్పోటనానికి దారి తీసింది. ఇటీవలి కాలంలో ఒక విద్యా సంస్థలో మొదలైన ఆందోళన దేశాన్ని ఇంతగా కదిలించిన సందర్భం లేదు. మత తత్వ ధోరణులు, కుల వివక్షలు, విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వాధినేతల పెత్తనం వంటివన్నీ విషవలయంగా తయారైన ఫలితమిది. వివిధ పార్టీల జాతీయ నాయకులు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ రావడం, సందేశాలు పంపడం కేంద్రానికి మింగుడు పడకున్నా ప్రజాస్వామ్య రాజకీయాలలో సహజం. ‘హెచ్‌సీయూ’ కేంద్రం అధీనంలోది గనక వివాదం ఎబివిపితోనే గనక బిజెపి ప్రత్యేకించి విమర్శలు తప్పించుకోలేదు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖరాసి ఒత్తిడి పెంచిన వాస్తవాన్ని ఖండించే అవకాశం కూడా లేదు. ఆయన లేఖలో ఏముంది…ఆయన ప్రజలకు దగ్గరగా వుంటారా…అనేది ఇక్కడ చర్చ కాదు. అవన్నీ ఏమున్నా ఆరెస్సెస్ భావజాలాన్ని తుచ తప్పకుండా పాటించే దత్తాత్రేయ యూనివర్సిటీ జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిపోయిందని చెప్పడం అవమానకరంగానే కనిపిస్తుంది. వాస్తవానికి దేశమే అసహనానికి అడ్డాగా మారిపోయిందన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో దానికి విరుగుడు ఏమిటో హెచ్వోయూ చూపించింది. సమాజంలో మార్పును కోరే వారు వివక్షను వ్యతిరేకించేవారు ఒక్క వేదికపైకి వచ్చి నిరసిస్తే ఎంత బలంగా ఉండేది చెప్పింది.
జరిగిన దానిపై విచారం వెలిబుచ్చి తగు నివారణ చర్యలు తీసుకోవలసిందిపోయి బిజెపి దాని అనుబంధ సంస్థలు, ప్రత్యక్ష పరోక్ష మిత్రులు మరోసారి విద్యార్థులపైనే దాడి చేస్తూ పుండుమీద కారం చల్లినట్టు వ్యవహరించాయి. పోలీసులు ఉన్నతాధికారులు నివేదికల్లో పేర్కొన్న సత్యాలకు కూడా భిన్నమైన విడ్డూరవాదనలు చేస్తున్నారు. అసలా విద్యార్థిపై పెద్దగా దాడి జరిగిందే లేదని కోర్టుకు పోలీసులు చెప్పడంలో ఏ రాజకీయం ఉంది? సోషల్ ఇంజనీరింగ్ అనీ, అట్టడుగు వర్గాలకు చేరువ కావాలని చెప్పే అధికార పక్షీయులు, తీరా సందర్భం వచ్చేసరికి అసలు రూపం చాటుకుంటున్నారు. పైగా ఆందోళనలో ముఖ్యాంశాలు వదలిపెట్టి ఆత్మాహుతి చేసుకున్న రోహిత్ దళితుడవునా కాదా అనే మీమాంస రగిలించారు. సోషల్‌మీడియాలో అగ్రవర్ణ వీరశైవులు రెచ్చిపోయి ఈ వాదన వ్యాపింపచేస్తూ మృతునికి కళంకం ఆపాదిస్తున్నారు. ఈ ఆందోళన శవరాజకీయం అనేవారే శవం కులం వెదికే పని మొదలుపెట్టారు. మంత్రి సృతి ఇరానీ అయితే దళిత (ఎఎస్యు) విద్యార్థుల సస్పెన్షన్ నిర్ణయంలో దళిత అధ్యాపకులు కూడా భాగంగా ఉన్నారని వాదించి మరింత వ్యతిరేకత మూటకట్టుకున్నారు. వారంతా పాలనా బాధ్యతలనుంచి వైదొలగడంతో మరో సంక్షోభం మొదలైంది. పైగా ఇది ఇతర యూనివర్సీటీలకూ వ్యాపిస్తున్నది. ఇదంతా స్వయంకృతం.
దత్తన్న లేఖ, సస్పెన్షన్లు ఆత్మహత్యల పైన పొరబాటు జరిగిందని ఒప్పుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇంతకన్నా మెరుగ్గా వుండేది. కాని బిజెపి రాజకీయ సైద్ధాంతిక స్వభావం అందుకు సిద్ధమయ్యే ప్రసక్తి వుండదు. కమ్యూనిస్టులనూ, లౌకిక వాదులను, మేధావులను శాపనార్థాలు పెట్టేస్తే అదే సర్దుకుంటుందనేది వారి ఆలోచన. సస్పెన్షన్ల నిలిపివేత ఆలస్యంగా ప్రకటించిన అసమగ్ర చర్య. నిజానికి చాలా మాసాలుగా స్కాలర్‌షిప్పుల బిగింపుతో సహా అనేక కక్ష లేదా శిక్ష చర్యలు సాగిపోతున్నాయి. ఇంతటి సంఘీభావం తర్వాత కూడా తప్పు దిద్దుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్న వైస్ ఛాన్సలర్ అప్పారావు కాని కేంద్రం గాని, ఈ ఒత్తిడి లేకపోతే మరెంత నిర్లక్ష్యపూరితంగా ఉండేవారో ఊహించవచ్చు. ఈ ఉద్రిక్తత కొనసాగుతుండగానే ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీకి మరో కాషాయానుయాయిని వైస్ చాన్సలర్‌గా వేశారంటే పట్టువిడుపులకు సిద్దంగా లేరన్నది స్పష్టం. ప్రపంచంలో విశ్వ విద్యాలయాల్లో మొదలైన ఆందోళనలు ఉద్యమాలే అనూహ్య రాజకీయ మార్పులకు కారణమైనాయి. ఇప్పుడు ఆ చరిత్ర పునరావృతమైతే ఆశ్చర్యపోనవసరం లేదు.