బీసీలపై చాలా ప్రేమ కురిపించారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. కొవ్వూరు జరిగిన బీసీల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన్ని నమ్మి బీసీలంతా మోసపోయారనీ, అలాంటివారికి తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. నవరత్న పథకాల ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అంతేకాదు, చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని కులాలవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ సీటు కూడా బీసీలకే ఇచ్చాస్తాననీ హామీ ఇచ్చారు! పేదలు పెద్ద చదువులు చదవాలన్న ఉద్దేశంతో నాన్నగారు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం తెచ్చారనీ, దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి రాగానే, పేదల పిల్లలు చదువులకు అవసరమైన సొమ్మంతా తామే ఇచ్చేస్తామనీ హామీ ఇచ్చారు!
నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చినంత మాత్రాన బీసీలు అభివృద్ధి అయిపోనట్టు చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా తనకు ఎంతవరకూ ఉపయోగపడిందని మాత్రమే ఆయన ఆలోచిస్తారనీ, ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలు గుర్తొకొచ్చి అడ్డగోలుగా హామీలు ఇస్తారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇంజినీర్లు, డాక్టర్లుగా పేద విద్యార్థులు ఎదగలేకపోతున్నారని అన్నారు. రాజన్న స్వర్ణయుగాన్ని మరోసారి తీసుకొచ్చేందుకే నవరత్న పథకాలను ప్రకటించామని జగన్ చెప్పారు. ప్రతీ విద్యార్థికీ మెస్ ఛార్జీల కింద రూ. 20 వేలు, బిడ్డను బడికి పంపే తల్లికి ఏడాదికి రూ. 15 వేలు, అవ్వతాతలకు నెలకు రూ. 2 వేల పెన్షన్… ఇవన్నీ తన పాలనలో అందుతాయని మరోసారి చెప్పారు.
ఉన్నట్టుండి బీసీలపై ఇంత ప్రేమ జగన్ కు పుట్టుకొచ్చిందంటే కారణం… ఎన్నికలే కదా! ఇన్నాళ్లూ బీసీల గురించి ఇంతగా ఆయన మాట్లాడలేదే. ఇన్ని హామీలు కురిపించలేదే. రాష్ట్ర ప్రభుత్వం ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇస్తే అభివృద్ధి అవుతుందా అని ఎద్దేవా చేస్తున్నారే… మరి, ప్రతీదానికీ ప్రజలకు డబ్బు ఇవ్వడేమనా జగన్ తీసుకుని రాబోతున్న ‘నాన్నగారి స్వర్ణయుగం’..? బడికి వెళ్తే డబ్బు, బడికి పంపినవారికి డబ్బు, అనారోగ్యంతో బాధపడినవారి డబ్బు, ఆకలితో ఉన్నవారి డబ్బు… జగన్ ఇస్తున్న హామీల్లో డబ్బు చుట్టూ తిరిగేవే ఎక్కువ! ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచితే పేదలకు అందుబాటులోకి వస్తాయి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచితే పేదలకు మేలు జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే పేదల జీవన సరళి మారుతుంది. కుల వృత్తుల వారికి ఉపకరించే పరికరాలిస్తేనే వారి పనుల్లో నాణ్యత పెరుగుతుంది. సమస్యను శాశ్వత ప్రాతిపదికలో పరిష్కరించాలన్న కోణం జగన్ హామీల్లో కనిపించదు. తాజాగా బీసీలపై కురిపిస్తున్న ఈ కొత్త ప్రేమ వెనక కూడా ఉన్నవి కేవలం ఎన్నికల ప్రయోజనాలు మాత్రమే కదా!