సినిమా వార్తల కంటే ఈ మధ్య సినిమా వేడుకల్లో ఎక్కువ కనిపిస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. మొన్న ‘తేజ్.. ఐ లవ్ యు’ వేడుకకి వచ్చి మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశాడు. నిన్న ‘సమ్మోహనం’ ప్రీ రిలీజ్ వేడుకకి వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబుని తెగ పొగిడేశాడు. ఈ రోజు ఉదయం జరిగిన ‘పరిచయం’ తొలి పాట విడుదల కార్యక్రమానికి వచ్చాడు. ‘సమ్మోహనం’ వేడుకలో హరీష్ శంకర్ మాటలు గమనిస్తే… మరో సినిమా వేడుకకి అతిథిగా వచ్చినట్టు కాకుండా, తనకు అవకాశాలు అడగడం కోసం అక్కడికి వెళ్లినట్టు వుంది.
ముందు హీరో సుధీర్ బాబును అడిగాడు. అతను ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ‘నిర్మాతలు దర్శకులకు అడ్వాన్సులు ఇస్తారు. మీకు గుర్తు చేస్తున్నా’ అన్నాడు. నెక్ట్స్ హీరోయిన్ అదితీరావు హైదరిని అందంగా వున్నారంటూ రెండు పొగడ్తలతో సంతోషంలో ముంచి… ఆమెతో పని చేయాలని వుందని మనసులో కోరికను బయట పెట్టారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారినీ వదల్లేదు. ఐదేళ్లుగా కృష్ణప్రసాద్ గారు తనతో సినిమా చేయాలని అంటున్నారని, ఆరో ఏడాది వచ్చేసిందని గుర్తు చేస్తున్నానంటూ తెలివిగా మాట్లాడారు. ముఖ్య అతిథి మహేష్ బాబుని మాంచి అందంగా అడిగారు. మహేష్ ఏ దర్శకుడితో పని చేస్తే… ఆ దర్శకుడి బాడీ లాంగ్వేజ్ తెర మీద ఆయన బాడీలో కనిపిస్తుందనీ, ఒక్కసారి నా బాడీ లాంగ్వేజ్ చూపించే అవకాశం ఇవ్వమని నేరుగా అడిగేశాడు.
నువ్వులు పూయించడానికి ఆయన అలా అన్నారో.. నిజంగా మనసులో మాటలు బయటకు వచ్చాయో… ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ స్టేజిలో లేకపోవడంతో హరీష్ శంకర్ అందర్నీ అవకాశాలు అడిగినట్లు అయ్యింది