ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో… వైసీపీ అధినేత జగన్ ఆస్తుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. విజయ్ మాల్యాతో పోలుస్తూ.. ఆయన ఆస్తులు వేలం వేసినట్లు… జగన్ ఆస్తులు ఎందుకు వేలం వేయరని ప్రశ్నిస్తున్నారు. మాల్యా కన్నా తీవ్రమైన నేరాలు చేసి జగన్ ప్రజాసంపదను దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇది చంద్రబాబు బయటకు చేస్తున్న డిమాండ్ మాత్రమే.. కానీ అంతర్గతంగా మాత్రం.. ఈ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా… చాలా రోజుల క్రితం… సన్నాహాలు ప్రారంభించారు. అందుకే… సాక్షి మీడియా తనపై లేనిపోని ఆరోపణలు చేసినప్పుడల్లా… ఈ రకంగా ఏదో ఓ హెచ్చరిక పంపుతూనే ఉంటారు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ముందడుగు పడింది. “స్పెషల్ కోర్టు యాక్ట్-2016 “ను ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రకారం.. అవినీతి, అక్రమాలకు పాల్పడి సంపాదంచిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ..ఈ చట్టంను ఉపయోగించి.. తొలి కేసు నమోదు చేసింది. ఆరు నెలల కిందట భారీ ఆస్తులతో ఏసీబీకి చిక్కిన సర్వే ఇన్స్పెక్టర్ జీఎల్ గణేశ్వరరావు కేసుపై ఈ చట్టం కింద తొలి కేసు నమోదు చేశారు. దాడుల్లో బయటపడిన గణేశ్వరరావు ఆస్తులన్నింటినీ… ఏసీబీ అధికారులు సీజ్ చేసి కోర్టు ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు. ఈ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటి వరకు… అవినీతి కేసుల్లో పట్టుబడినా… అధికారులు మాత్రం తాము అక్రమంగా సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూనే ఉండేవారు. ఇక ముందు ఆ అవకాశం లేదు. “స్పెషల్ కోర్టు యాక్ట్-2016” కింద కేసు నమోదు చేస్తే అక్రమార్కుల ఆస్తి నెల రోజుల్లోగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. చరాస్తులు కోర్టులో డిపాజిట్ చేస్తే, స్థిరాస్తులపై వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికే జమ అవుతుంది. కేసు రుజువైతే ఆస్తి శాశ్వతంగా ప్రభుత్వానికి చెందుతుంది. ఒకవేళ వీగిపోతే మాత్రం ఐదు శాతం వడ్డీతో ఆస్తులను అప్పగిస్తారు.
గతంలో బీహార్‌లో ఓ అవినీతి అధికారి భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్కూలుగా మార్చిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ తరహాలోనే జగన్ భవనాలను, ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్‌కు చెందిన అనేక ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అటాచ్లోఉన్నాయి. కొత్తగా “స్పెషల్ కోర్టు యాక్ట్-2016 “ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం సాయంతో… ఏపీలో ఉండి.. కేంద్రం దర్యాప్తు సంస్థలు జప్తు చేసిన ఆాస్తులను స్వాధీనం చేసుకునే అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించే అవకాశం ఉంది. కానీ ఇది అంత తేలికైన విషయం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. జగన్ కేసులో విచారణ కూడా మందగించింది. కొద్ది రోజుల కిందట.. ఈడీ అటాచ్ చేసిన రెండు ఆస్తులను కూడా కేంద్రం సీక్రెట్‌గా రిలీజ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో… ఏపీ కొత్తగా చేసిన చట్టం వల్ల జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కష్టమేనన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. కానీ ఏ చిన్న అవకాశం అయినా దొరికితే మాత్రం వదిలి పెట్టరని చెబుతున్నారు. జగన్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తే మాత్రం అదో సంచలనమే.