పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో పైలాన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సాక్షికి ఎలా కనిపించిందంటే… ‘ఐదో వీధి నాటకం’ అని ఓ వార్త వండి వార్చేశారు. గతంలో నాలుగుసార్లు శంకుస్థాపనల కార్యక్రమాల పేరుతో హడావుడి చేశారనీ, ఇది ఆ కోవకి చెందిన ఐదో కార్యక్రమం మాత్రమే అని ప్రెజెంట్ చేశారు. జాతికి అంకితం అంటూ మరో కొత్త డ్రామాకి తెర లేపారని కథనం రాశారు. అంతేకాదు, జగన్ పాదయాత్రకు భయపడే పోలవరంలో ఈ కార్యక్రమం చంద్రబాబు పెట్టారంటూ ఆ పార్టీ నేతలు కొంతమంది అభివర్ణించే ప్రయత్నమూ చేస్తున్నారు.
సరే, పోలవరంలో జరిగిన కార్యక్రమంపై వైకాపా హర్షిస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందనీ, కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని చంద్రబాబు తన భుజానికి ఎత్తుకున్నారనీ, దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచి వచ్చేశారని కూడా వైకాపా నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే! ఇంకోపక్క, ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకునే విధంగా కేంద్రానికి లేఖలు, కోర్టుల్లో కేసులు వేస్తున్నదీ వారే. కానీ.. ఇంత చేస్తున్నా ఇప్పుడు ‘పోలవరంపై క్రెడిట్ మాత్రం కావాలట’! ‘పోలవరం గురించి అన్నీ మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఈ ప్రాజెక్టుకు ఎవరు ప్రారంభోత్సవం చేశారన్న విషయం గురించి మాట్లాడలేదు. శంకుస్థాపన గురించి కనీసం ప్రస్థావించకపోవడం గమనార్హం’ అంటూ సాక్షిలో విశ్లేషించారు.
సాక్షి తీరు ఎలా ఉందంటే… ఎప్పుడో జరిగిన శంకుస్థాపన క్రెడిట్ వైకాపాకి కావాలి, కానీ ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరుపై వారికి బాధ్యత ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది! రాష్ట్రంలో ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంటే, అడుగడుగునా కేంద్రం అడ్డు తగులుతూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా కేంద్రాన్ని ఏనాడైనా ప్రశ్నించారా..? అది చాలదన్నట్టు ఉల్టా రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతుంటే హర్షించాల్సింది పోయి… ఎద్దేవా చేస్తున్నారు. నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారంటూ ఎద్దేవాపూర్వకంగా పత్రికలో రాస్తున్నారు. ఆ నాలుగు సార్లు నాలుగు రకాల పనులు ప్రారంభమైన సంగతి గురించి సాక్షి ఎందుకు మాట్లాడదు..? ఇప్పుడు జరిగిన డయాఫ్రం వాల్ నిర్మాణం ఆర్భాట కార్యక్రమమా..? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు కనిపించడం లేదా..?