యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్రిక్తతల కారణంగా కేంద్రంలోని బిజెపి విమర్శలతో ఉక్కిరి బిక్కిరవుతున్న మాట నిజమే గాని మరో రెండు పాలకపక్షాలకూ విమర్శలు తప్పలేదు. ఇది కేంద్రానికి సంబంధించింది గనక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. నిజానికి వేముల రోహిత్ ఆత్మహత్య వెంటనే విసి పైన, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలపై ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేయడంలో పోలీసులు గట్టిగానే వ్యవహరించారు. అయితే కథ అక్కడితో ఆగిపోయింది. దానిపై ఎలాటి కొనసాగింపు లేదు. కేంద్రం కూడా ఏదో పరిశీలనా నివేదిక పేరుతో సరిపెట్టడం తప్ప ప్రక్షళన చేసింది లేదు. రాజకీయ ఇబ్బందులను బట్టి కేంద్రం కదల్లేదని తెలుస్తూనే ఉంది. కాని చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఎందుకు వేగంగా స్పందించలేదు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, సురవరం వంటి వారంతా బాధితులను సందర్శిస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ గాని లేక ఆయన ప్రభుత్వం పార్టీల తరపున గాని ఎవరూ ఎందుకు సందర్శించలేదు? జిహెచ్‌ఎంఎసి ఎన్నికల కోసం హైదరాబాదును ఊపేస్తున్న మంత్రి కెటిఆర్ విద్యాసంస్థలతో తరచూ ముఖాముఖి జరుపుతుంటారు గదా…ఆయనైనా ఎందుకు దయచేయలేదు? దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించి ఉండొచ్చు గాని వారి అధినేత్రి పరామర్శించేందుకు రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అలాగే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఆయన సహచరులు గాని, అగ్గిబరాటాలుగా చెలరేగిపోయే రేవంత్ రెడ్డి వంటి వారు గాని దళిత నేతల ముద్రాంకితులైన మోత్కుపల్లి నరసింహులు వంటివారు గాని మొహం చూపించకపోవడానికి కారణమేమిటి? ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని, చినబాబు లోకేష్ గాని ఇటుకేసి రాకపోవడానికి కారణాలున్నాయా?
ఏదైనా ఘటన జరిగినప్పుడు కేవలం మొక్కుబడిగా వచ్చిపోతే ఉపయోగం లేదన్నది ఒకటి. కాని తాము అండగా ఉంటామని చెప్పడానికి ఏదో రూపంలో సందర్శించడం రాజకీయ పక్షాల బాధ్యత. టిడిపి, టిఆర్‌ఎస్‌లు ఆ పని చేయకపోవడానికి స్థానిక, జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు ఎన్నికల్లో అన్ని కులాల ఓట్లు రావాలంటే కేవలం దళితులతో ముడిపడిన ఈ ఆందోళనకు దూరంగా ఉండాలి. రెండోది కేంద్రంలో బిజెపితో మంచిగా ఉండాలంటే ఇందులో తలదూర్చనేకూడదు.
ఈ పార్టీలు, ప్రభుత్వాలు ప్రయోజనాలను బట్టి తప్ప ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం వంటి అంశాలకు విలువ నిచ్చేవి కావని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా? అసహనంపైన ఇప్పటి వరకూ ఉభయ చంద్రుల నుంచి ప్రకటనే రానప్పుడు ప్రతిఘటనను బలపర్చేందుకు ప్రత్యక్షంగా కదలిరావడం ఊహకందేదేనా? అదే బిజెపి ధీమా కూడా. ఏమైనా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో జరిగిన ఘటనపై డిల్లీ ముఖ్యమంత్రి తప్ప తెలుగు పాలకులు కనిపించకపోవడం విడ్డూరమే!