కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకుని వాటిపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాకుండా, బలోపేతం అయ్యేందుకు బాగా అవకాశమున్న రాష్ట్రాలపై ఆయన దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఈ రాష్ట్రాల్లోని 120 ఎంపీ సీట్లపై భాజపా కన్నేసింది. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ వ్యూహాలను ఇప్పట్నుంచే ఖరారు చేస్తున్నారు. దాన్లో భాగంగా అమిత్ షా ఆయా రాష్ట్రాల పర్యటనలు పెట్టుకున్నారు. ఈ నెల 7 నుంచి ఈ పర్యటనలు ప్రారంభమౌతున్నాయి. వచ్చే నెల 20 వరకూ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న తెలంగాణకు రానున్నారు.
నిజానికి, అమిత్ షా హైదరాబాద్ వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. అదిగో ఇదిగో వస్తారూ, భాజపాలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు చేరబోతున్నారని కూడా చాలా హడావుడి చేస్తూ వచ్చారు. కానీ, అలాంటి భారీ చేరికలూ జరగలేదు, పైగా భాజపాలోకి చేరతారు అనుకున్న నేతలు కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయిన పరిస్థితే రాష్ట్రంలో కనిపించింది. అయితే, దాదాపు ఏడాదిగా తెలంగాణ భాజపాలో కొంత స్తబ్దత నెలకొంది. తెరాసపై ఎలాంటి వైఖరి అనుసరించాలన్నది కూడా రాష్ట్ర నేతలకు కొంత గందరగోళమే నిన్నమొన్నటి వరకూ ఉండేది. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టే వరకూ తెరాసపై ఎలా స్పందించాలనే స్పష్టత భాజపా నేతలకు లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గడచిన ఏడాదిపాటు ఏవో కొన్ని యాత్రల్లాంటివి నామ్ కే వాస్తే అన్నట్టుగానే రాష్ట్ర నాయకత్వం చేస్తూ వచ్చిందే తప్ప… పార్టీ అనూహ్యంగా బలోపేతం అయ్యేందుకు కావాల్సిన కార్యక్రమాలేవీ చేపట్టలేదు.
ఇకపై రాష్ట్రంలో పార్టీకి స్పష్టమైన దిశా నిర్దేశం ఏర్పడుతుందనీ, అమిత్ షా రాకతో వ్యూహాలు ఖరారు అయిపోతాయని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. ఎంపీ స్థానాలతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కూడా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా స్పష్టత వచ్చేస్తుందని లక్ష్మణ్ అంటున్నారు. బలోపేతం అంటే.. ముందుగా తెలంగాణ భాజపాలో పేరున్న నాయకులు కావాల్సిన అవసరముంది. గత ఎన్నికల్లో మాదిరిగా కేవలం మోడీ వేవ్ ఒక్కటే వచ్చే లోక్ సభ ఎన్నికల్ని గట్టెక్కించే పరిస్థితి కనిపించడం లేదు, ఆ సంగతి అమిత్ షాకు కూడా తెలుసు. అందుకే, ఇప్పట్నుంచీ చాలా జాగ్రత్తపడుతున్నారు. ఇంతకీ.. తెలంగాణలో భాజపా విస్తరణకు అమిత్ షా ఇవ్వబోతున్న విజన్ ఏంటనేది వేచి చూడాల్సిందే.