మరోసారి వార్తల్లోకి వచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మరోసారి కేంద్రంతో ఢీ అంటూ నిరసనకు దిగారు. ఇంతకీ తాజా ధర్నా ఎందుకంటే… ఐ.ఎ.ఎస్. అధికారులు గత నాలుగు నెలల నుంచీ విధులకు హాజరు కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నా లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ పట్టించుకోవడం లేదన్నది కేజ్రీవాల్ డిమాండ్. దీంతో ఏకంగా ఎల్.జి. ఆఫీస్ లోనే ఆయన ధర్నాకు దిగడం విశేషం! దీంతోపాటు, సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎల్.జి. పక్కన పడేస్తున్నారనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మంచి చేద్దామని భావిస్తుంటే ఇలాంటి పరిస్థితి నెలకొందని కేజ్రీవాల్ అంటున్నారు..
కేజ్రీవాల్ చేస్తున్న ఈ ధర్నాతో భాజపా ఎలాగూ తీవ్రమైన ఆగ్రహంతో ఉంటుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన ధర్నాకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేకపోవడం గమనార్హం. ఎందుకంటే, కేజ్రీవాల్ మరింత ఎదిగితే జాతీయ స్థాయి రాజకీయాలకి వచ్చేస్తారేమో అనేది వారి అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న ఊహాగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ సీట్లను ప్రభావితం చేయడం కోసమే కేజ్రీవాల్ మరోసారి ఇలా తన నిరసన గళం పెంచుతున్నారని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్, భాజపాల మధ్య పోరు ఎలా ఉన్నా, కేజ్రీవాల్ దగ్గరకి వచ్చేసరికి ఈ రెండు జాతీయ పార్టీలూ దాదాపు ఒకేలాంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉండటం. ఆమ్ ఆద్మీ డిమాండ్లను కేంద్రంలోని అధికార పార్టీగా భాజపా నిర్లక్ష్యం చేస్తుంటే… ఆప్ ధర్నాలకూ నిరసనలకూ మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు. అంటే, ఆప్ ఎదగడం రెండు పార్టీలకూ సమ్మతమైన అంశం కాదుకదా! ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లో పోటీ అని కేజ్రీవాల్ అంటున్నారు, ఆప్ ని జాతీయ పార్టీగా విస్తరించాలనే కలలు ఆయనకీ ఉన్నాయి. కాబట్టి, రెండు పార్టీలూ ఆప్ విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. గతం కన్నా కేజ్రీవాల్ కొంత ఆదరణ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆప్ మంత్రుల వ్యవహార శైలి, కేజ్రీవాల్ అత్యుత్సాహం వంటివి పార్టీకి కొంత ఇబ్బందికరమైనవిగా పరిణమించినా.. క్షేత్రస్థాయిలో మధ్య తరగతి, పేద వర్గాల నుంచి ఆమ్ ఆద్మీకి మద్దతు అయితే బాగానే ఉందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్, భాజపాల వైఖరే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.