హైదరాబాద్: సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ప్రధాని నరేంద్ర మోడి స్పందించారు. మోడి ఇవాళ ఉత్తరప్రదేశ్లోని వారణాసి, లక్నో నగరాలలో పర్యటించారు. సొంత నియోజకవర్గం వారణాసిలో వారణాసి నుంచి ఢిల్లీకి మహామాన అనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన తర్వాత లక్నో చేరుకున్నారు. భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని చెప్పారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. దేశానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సి రావటం విచారకరమని చెప్పారు. కారణాలు, రాజకీయాలు ఏమైనా అయిఉండొచ్చని, అతని తల్లి ఎంత బాధపడి ఉంటుందో అని వ్యాఖ్యానించారు. మరోవైపు మోడి ఈ వ్యాఖ్యలు చేయకముందు ఆయన ప్రసంగానికి కొందరు అడ్డుపడుతూ మోడి ముర్దాబాద్, రోహిత్ వేముల అమర్ రహే అని, అతని మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వారిని పోలీసులు ఆడిటోరియంనుంచి బయటకు తీసుకెళ్ళారు.