ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్… తన సహచర మంత్రులతో కలిసి… లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోమూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీనికి కారణం.. ఐఏఎస్ అధికారులు నాలుగు నెలలుగా.. ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి పనులు చేయడం లేదు. అంటే వారు దాదాపుగా సమ్మెలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ సీఎస్ అనుష్ ప్రకాష్‌తో కేజ్రీవాల్ కు వివాదం ఏర్పడింది. ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పటి నుండి ఐఏఎస్‌లు కేజ్రీవాల్ సర్కార్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. అధికారుల తీరుపై కేజ్రీవాల్ చాలా సార్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో కేజ్రీవాల్… ఆయన మంత్రి వర్గ సహచరులు.. లెఫ్టివెంట్ గవర్నర్‌ను కలవడానికి వచ్చి… అదే ఆఫీసులో బైఠాయించారు.
ఢిల్లీ ప్రజల సమస్యలు తీర్చడం కోసమే నిరసనకు దిగామని కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. మరో దారిలేకే నిరసనలకు దిగాల్సివచ్చిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేస్తూ.. కేసులు పెట్టి ఆప్ నేతలను బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ మండి పడుతున్నారు. కేజ్రీవాల్ అవడానికి ఢిల్లీకి ముఖ్యమంత్రే కానీ.. ఆయనకు కనీసం బంట్రోతుపై చర్యలు తీసుకునే అధికారం కూడా లేదు. దీనికి కారణం..ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ అసెంబ్లీ ఉన్నా…. అధికారాలు దాదాపు లేనట్లే. ముఖ్యమంత్రి చేతుల్లో కూడా ఏమీ ఉండదు. అంతా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా కేంద్రం నడిపించేస్తుంది. పోలీసులు సహా… వ్యవస్థ మొత్తం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కనుసన్నల్లోనే ఉంటుంది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారులకూ మధ్య వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కేజ్రీవాల్ పోరాడుతున్నారు. బీజేపీ కూడా ఢిల్లీకి రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో… ఈ అంశాన్ని మోదీ సర్కార్ పూర్తిగా లైట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ అధికారం లేకపోవడంతో… రాష్ట్ర ప్రతిపత్తి కోసం కేజ్రీవాల్… కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. తామే ఓ ముసాయిదా బిల్లు రూపొందించి .. ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించి ఆమోదించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో అది చట్టం వరకూ వెళ్లలేదు.
తనకు ఉన్న పరిమిత అధికారాలతో… కేజ్రీవాల్… ప్రజలకు ఉపయోగపడేలా మొహల్లా క్లీనిక్‌లు, మంచినీరు, కరెంట్ చార్జీల తగ్గింపు వంటి అంశాల్లో కాస్తంత మంచి పేరు ప్రజల్లో తెచ్చుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆ పనులను కూడా… ఐఏఎస్ అధికారులను పని చేయకుండా చేసి… అడ్డుకుంటున్నారన్న విమర్శలు కేంద్రంపై వస్తున్నాయి. రాజకీయాలు చేయడంలో రాటుదేలిపోయిన ఎన్డీఏ గవర్నర్ల జాబితాలోకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వస్తారు. కాబట్టి.. కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి అయినా ధర్నాలు తప్పడం లేదు.