కర్ణాటకలో అత్యధిక సీట్లు తెచ్చుకున్న తమకే ప్రజామద్దతు ఉందని వాదిస్తున్న భారతీయ జనతా పార్టీకి…మరో ఎదురు దెబ్బ తగిలిదింది. తమ అభ్యర్థి హఠాత్తుగా మరణించడంతో ఎన్నిక వాయిదా పడిన జయనగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి విజయం సాధించారు. జయనగర్ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా .. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయకుమార్.. ఎన్నికల ప్రచారంలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆ స్థానానికి ఈ నెల పదకొండో తేదీ ఎన్నిక నిర్వహించారు. ఈ రోజు జరిపిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ విజయం సాధించింది. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు బయటపడటంతో వాయిదా పడిన రాజరాజేశ్వరి నగర్ స్థానం ఎన్నికలోనూ బీజేపీకి షాక్ తగిలింది. ఆ స్థానంలో బీజేపీ 40 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయింది.
జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి సంస్థాగతంగా మంచి బలం ఉంది. టిక్కెట్‌ను కూడా.. మరణించిన బీజేపీ ఎమ్మెల్యే విజయకుమార్ సోదరుడు ప్రహ్లాద్కే ఇచ్చారు. సానుభూతి పవనాలతో అయినా గట్టెక్కవచ్చని ఆశించారు. కానీ బీజేపీకి ఈ విషయంలోనూ ఊరట లభించలేదు. ఓటర్ల సానుభూతి కూడా దక్కలేదు. ఈ స్థానంలో జేడీఎస్ కూడా.. గతంలో బరిలో ఉంది. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ -జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు జయనగర్‌లో పెద్దగా బలం లేదు. అందుకే పోలింగ్‌కు ముందు బరి నుంచి వైదొలిగి.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది. బీజేపీ కంచుకోటలో ఆ పార్టీని మట్టి కరిపించింది.
రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. బీజేపీకి కచ్చితంగా ప్రమాద ఘంటికలే. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఈ స్థానాల్లో వచ్చిన ఫలితాలను బట్టి విశ్లేషించవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిలో సీట్లు తగ్గుతాయని… వాటిని దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. వారి దృష్టిలో మొదటిగా ఉన్నది కర్ణాటకనే. కానీ ఇప్పుడు కర్ణాటకలోనే పరిస్థితులు అనుకూలంగా లేవని తేలిపోతూండటంతో.. బీజేపీ అగ్రనేతల్లో ఆందోళన ప్రారంభమయింది.