సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగిస్తున్నారు. బుధవారం యాదాద్రికి వెళ్లిన మోత్కుపల్లి, మరోసారి విమర్శలు కురిపించారు. తాను తిరుమలకు వస్తాననీ, చంద్రబాబు ఓడిపోవాలని దేవుడిని మొక్కుకుంటా అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఏపీ ప్రజలు ఓడించాలన్నారు. గవర్నర్ పదవి రాలేదనీ, రాజ్యసభ సీటూ దక్కలేదన్న అక్కసుతో ఆయన పార్టీకి దూరమయ్యారన్నది తెలిసిందే. సరే, వెళ్తూవెళ్తూ పార్టీపై దుమ్మెత్తి పోయడం, మహానాడు సమయంలో విమర్శలు చేయడంతో సహజంగానే టీడీపీ శ్రేణుల వ్యతిరేకత ఆయన ఎదుర్కొన్నారు. తనతో కనీసం మాటలైనా ఆడకుండా పార్టీ నుంచి దూరం చేసే కుట్ర జరిగిందన్నది మెత్కుపల్లి ఆరోపణ. వచ్చే ఎన్నికల్లో ఆయన ఆలేరు నుంచి పోటీకి దిగుతా అంటున్నారు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలూ నేతలూ స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని మెత్కుపల్లి కోరుతున్నారు.
మోత్కుపల్లికి ఏపీ రాజకీయాలపై ఆసక్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీకి దూరమయ్యాక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులపై ఆ ఇద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మోత్కుపల్లితో భేటీ అయినట్టు సమాచారం! అంటే, టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన వారం రోజుల్లోనే ఏపీ నేతలతో ఆయన సమావేశాలూ సమాలోచనలూ చేస్తున్నారు. ఇంతకీ, విజయసాయి రెడ్డితో మోత్కుపల్లికి పనేముంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
ఈ భేటీలకు సంబంధించి టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు ఇమేజ్ డామేజ్ కి ఒక భారీ ప్రోగ్రామ్ ను ప్రతిపక్షం ప్లాన్ చేస్తోందనీ, ఇప్పటికే కొంతమందితో అదే పనిగా విమర్శలు చేయిస్తోందనీ, ఆ క్రమంలో మోత్కుపల్లి సేవల్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోందనే గుసగుసలు ఉన్నాయి! అయితే, జగన్ తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై కూడా మోత్కుపల్లి మండిపడ్డారు. అందుకే, తానే స్వయంగా ఏపీకి వచ్చి.. చంద్రబాబును ఓడించమని ప్రజలను కోరతా అంటున్నారు. మరి, విజయసాయితో భేటీ సంగతి ఏంటనే ప్రశ్న కూడా అలానే ఉంది కదా..? చంద్రబాబుపై విమర్శలు చేయడానికే తాను ఏపీ వస్తానని మోత్కుపల్లి ప్రకటించడం వెనక… సొంతంగా ఆయనకంటూ రాజకీయంగా ఏరకమైన ప్రయోజనమూ దక్కేట్టు కనిపించడం లేదు! ఎవరికో మద్దతుగా నిలిచేందుకు మాత్రమే వస్తున్న కోణమే కనిపిస్తోంది.