ఆంధ్రాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కడప, బయ్యారం పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఇంకా పరిశీలిస్తోందనీ, కాబట్టి ఇంతవరకూ దానిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి తాము రాలేదని ఆ ప్రకటనలో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మెకాన్ సంస్థకి అవసరమైన సమాచారం రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏపీలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామంటూ ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా ఇదే అంశం చెబుతూ… ఏపీలో ఉక్కు పరిశ్రమకు కేంద్రం కట్టుబడి ఉందనీ, అమిత్ షా కూడా అదే మాట చెప్పారనీ, కానీ అనవసరంగా తమకు దోషిని చేసే విధంగా ఏపీ అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారంటూ ఆయనా మండిపడ్డారు!
కానీ, వాస్తవం ఏంటంటే… ఉక్కు కర్మాగారాల ఏర్పాటు ప్రకటనపై కేంద్రం మాట మార్చింది! నిన్ననే, సుప్రీం కోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్లో పేర్కొన్నది ఏంటంటే… స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు లేవని తేల్చేశారు. దీంతో ఏపీలో మరోసారి అధికార పార్టీ నిరసనల స్థాయి పెంచింది. అంతేకాదు, అధికార పార్టీ ఎంపీలంతా మరోసారి ఇదే అంశంపై కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. కడప చుట్టుపక్కల ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, ఖనిజం ఉందనీ చాలా స్పష్టంగా మెకాన్ సంస్థ ఇది వరకే చెప్పిందని ఎంపీ కేశినేని నాని అంటున్నారు. ఎలాగో ఒకలా ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే సుప్రీంలో అలాంటి అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన విమర్శించారు.
అంటే, ఉద్దేశపూర్వకంగానే కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అసాధ్యమని చెప్పిన సెయిల్ రిపోర్టులను తెర మీదికి తెచ్చినట్టుగా కనిపిస్తోంది. కానీ, ఒక్కసారి నిరసనలు తీవ్రతరం అవుతున్న వైనాన్ని గమనించి.. ఇవాళ్ల యూ టర్న్ తీసుకుని, అబ్బే అలా ఎవరు చెప్పారూ.. సెయిల్ రిపోర్టు ఇచ్చినప్పటికీ, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, ఒక రాజకీయ నిర్ణయం తీసుకుని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని భాజపా నేతలు ఇప్పుడు అంటున్నారు. అంటే, సెయిల్ రిపోర్టు ఇప్పుడు ముఖ్యంగా కాకుండా పోయిందన్నమాట. నాలుగేళ్ల తరువాత, ఏపీకి ఇచ్చిన హామీపై ఇంకా రాజకీయ నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటనలకే పరిమితం అవుతుంటే… కేంద్రం తీరును ఎలా అర్థం చేసుకోవాలి..? ఏపీ నుంచి నిరసన పెరుగుతోందని తెలిసేసరికి నిర్ణయం మార్చుకున్న ఈ భాజపా సర్కారుని… రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని పదేపదే ఊకదంపుడు ప్రకటనలు చేస్తుంటే నమ్మేందుకు ఏమాత్రమైనా అవకాశం ఉందా..?