ప్రతీరోజూ ముఖ్యమంత్రిపై విమర్శలు చెయ్యాలి, అవినీతి చేశారంటూ ఆరోపణలు చెయ్యాలి, కోట్లకు కోట్లు దోచుకున్నారంటూ అంకెలు చెబుతూ ఉండాలి… ఇలాంటి డైలీ షెడ్యూల్ ఏదో ఏపీ భాజపా నేతలు పెట్టుకున్నట్టున్నారు. ఓపక్క భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండ్రోజులు ఢిల్లీకి వెళ్లొచ్చి ఇదే తరహా ఆరోపణలు చేశారు. మరోపక్క, ఇవాళ్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా మరోసారి వేల కోట్లు దోచేశారని ఆరోపిస్తున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్నది వారి ప్రభుత్వమే కదా.. ఈ ఆరోపణలేవో ఇక్కడ చేసే బదులు, ఆధారాలు ఏవైనా ఉంటే ఢిల్లీ పెద్దలకే పంపిస్తే చర్యలు తీసుకుంటారు కదా! ఈ తరహా కార్యాచరణ ఎందుకు ఉండటం లేదో అర్థం కావడం లేదు.
సరే, వీర్రాజు తాజా వ్యాఖ్యల విషయానికొస్తే… ముఖ్యమంత్రి చంద్రబాబు అనివీతి ముందు, జగన్ చేసింది చాలా చిన్నది అని చూపించే ప్రయత్నం పరోక్షంగా చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది! గృహ నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ పథకాల్లో కోట్లకు కోట్లు ముఖ్యమంత్రి దోచేశారని వీర్రాజు ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదనీ, లెక్క చూస్తే రూ. 30 వేల కోట్ల అవినీతి కేవలం గృహ నిర్మాణ పథకంలోనే జరిగిందన్నారు. ‘మాట్లాడితే ముఖ్యమంత్రి ఏమంటాడంటే… జగన్ 42 వేల కోట్లు దోచేశాడు, 42 వేల కోట్లు దోచేశాడు, జైల్లోకి వెళ్లి వచ్చేశారంటున్నాడు. నిజమే, పాపం ముఖ్యమంత్రి కరెక్టుగానే చెప్పారు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఒక్క పథకంలోనే రూ. 30 వేల కోట్లు దోచేస్తే, ఇతర పథకాల్లో ఇంకెంత దోపిడీ ఉందో అంటూ విమర్శించారు. ప్రతీ ప్రభుత్వ పథకాన్నీ చంద్రబాబు నాయుడు ఆదాయవనరుగా మార్చేసుకున్నారన్నారు. పేదవాడి రక్తాన్ని ఒక పులి మాదిరిగా తాగడానికి అలవాటుపడ్డారన్నారు.
ముఖ్యమంత్రిపై చేయాల్సిన విమర్శలూ ఆరోపణలూ చేస్తున్నారు కదా. మధ్యలో జగన్ ప్రస్థావన తేవాల్సిన అవసరం ఏముంది..? జగన్ గురించి మాట్లాడిన తీరు గమనిస్తే… జగన్ దోచుకున్నది రూ. 42 వేల కోట్లు మాత్రమే అని, కానీ చంద్రబాబు ఒక్క పథకంలోనే రూ. 30 వేల కోట్లు అవినీతి చేశారనీ, ఇతర పథకాల్లో ఇంకెంతో చేసి ఉంటారో అనే ఊహాజనిత అంచనా చెప్పారు! అంటే, జగన్ కంటే ఎక్కువ అవినీతి చేశారని చెప్పే ప్రయత్నమా ఇది..? అయినా, జగన్ పై కేసులు నమోదయ్యాయి, ఆయన జైలుకెళ్లొచ్చారు, ప్రతీ శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ విచారణకు హాజరౌతున్నారు! ఇదంతా ప్రజలకు తెలీదా..? ఈ విషయంలో ఇద్దరికీ పోలిక అన్నట్టుగా వీర్రాజు మాట్లాడుతుంటే ఏమని అర్థం చేసుకోవాలి..? ఆ క్రమంలో జగన్ చేసింది చిన్నదే అనే సౌండ్ వినిపించేలా మాట్లాడుతుండే ప్రయత్నాన్ని ఏమనాలి..? జగన్ విషయంలో భాజపా ఎంత సాఫ్ట్ గా మారిపోయిందనేది మరోసారి నిరూపితం కావడం లేదా ఇక్కడ..?