హైదరాబాద్: రోహిత్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడిన కొద్ది సేపటికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని రోహిత్ తల్లికి, సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. అటు రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై మంత్రి స్మృతి విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమిటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదిలా ఉంటే, రోహిత్ తండ్రి మణి కుమార్ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. అనేక విషయాలపై ఒకదానికొకటి పొంతన లేకుండా విలక్షణంగా స్పందించారు. తాను, తన భార్య రాధిక 2005లో విడాకులు తీసుకున్నామని ఒకసారి, 2012లో విడిపోయామని మరోసారి చెప్పారు. అయినా కలిసే ఉంటామని అన్నారు. తన భార్య రాధికను వాళ్ళ అమ్మ చెడగొడుతోందని చెప్పారు. తాము వడ్డెర కులస్తులమని అన్నారు. డబ్బు, ఉద్యోగం లాంటివేమైనా ఇస్తే తీసుకోవాలనుందని చెప్పారు. తన కొడుకు బ్రతికుండటంకంటే చచ్చే బాగా సాధించాడని అన్నారు. తన కొడుక్కు న్యాయం జరగాలని చెప్పారు. ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారో తెలియదని అన్నారు.