ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు తమకు దొరికే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఢిల్లీ స్థాయిలో తమ ఐక్యతను మరోసారి వెల్లడించే అవకాశం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ద్వారా వీరికి కలిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్న బీజేపీయేత పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా… ప్రాంతీయ, లెఫ్ట్ పార్టీలు చెందిన ముఖ్యమంత్రులు.. తమకు లభించిన అవకాశాన్ని వంద శాతం వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు పలుకుతూ.. నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి ఢిల్లీలో హల్ చల్ చేశారు. ఆంధ్రాభవన్‌లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేజ్రీవాల్‌ను పరామర్శించడానికి ప్రయత్నించారు. కానీ పర్మిషన్ రాకపోవడంతో.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్య సునీతతో మాట్లాడారు.
నలుగురు ముఖ్యమంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్‌కు తమ మద్దతు రాజకీయం కాదన్నట్లుగా కార్యకాలాపాలు చక్కబెట్టారు. కేజ్రీవాల్‌కు – లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య జరుగుతున్న పోరాటంగానే వారు చెప్పుకొచ్చారు. రెండు కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీలో పనులు జరగకుండా.. నాలుగు నెలల పాటు ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రులు కోరారు. ఆ తర్వాత కొద్ది సేపటికే… అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పీఎంవో డైరక్షన్ లోనే లెప్ఠ్‌నెంట్ గవర్నర్ ఢిల్లీలో పాలన స్తంభించిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో… గవర్నర్ల వ్యవస్థపై…చంద్రబాబు ఒక రోజు ముందుగా తీవ్ర విమర్శలు చేసి ఉన్నారు. అంటే.. వ్యూహాత్మకంగా.. నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లి రాజకీయాలు చేశారన్న భావన రాకుండా ఉండటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా టార్గెట్ చేయలేదు. కానీ పరోక్షంగా మాత్రం… మోదీని దోషిగా నిలబెట్టారు.
కేజ్రీవాల్ చేస్తున్న పోరాటం కారణంగా.. దేశవ్యాప్తంగా బలమైన విపక్ష పార్టీలన్నీ తాము బీజేపీకి ఎంత తీవ్రంగా పోరాడుతున్నామన్న విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. నలుగురు ముఖ్యమంత్రులు.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే ముందు ఆంధ్రాభవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ ఐక్యతను ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశంతో పాటు.. నీతి ఆయోగ్ భేటీలో వ్యవహరించాల్సిన వ్యూహంపైనా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేసే నిర్ణయాలపై… కేంద్రం గట్టిగా ఉంటే.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించి వాకౌట్ చేయాలన్న ఆలోచనలో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి బెంగుళూరులో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలు… తొలిసారి బలప్రదర్శన చేశారు. అది ఒక్క గ్రూప్ ఫోటోకే పరిమితం కాలేదని… ముందు ముందు కేంద్రం ఊహించని రీతిలో ఉండబోతోందని… కేజ్రీవాల్ పోరాటానికి సంఘీభావం తెలుపడం ద్వారా ముఖ్యమంత్రులు స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ఇది బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.