బయోపిక్… బయోపిక్… బయోపిక్… బాలీవుడ్డుతో పాటు టాలీవుడ్డులోనూ ఇప్పుడిదే ట్రెండ్. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ‘యన్.టి.ఆర్’ ప్రారంభించారు. తొలితరం స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారావు జీవితకథతో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో సుధీర్ బాబు హీరోగా యాక్ట్ చేయనున్నారు. రానా హీరోగా కోడి రామ్మూర్తి బయోపిక్, నాని హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. చాలామంది దర్శకులు చరిత్రలో తమకంటూ ప్రత్యేక పేజీలను ఏర్పరుచుకున్న ప్రముఖుల జీవితాలను వెండితెరపై చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చక్కటి చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాత్రం తనకు సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించాలని వుందని చెబుతున్నారు. అదీ కారంచేడు కేసు వాదించిన లాయర్ బయోపిక్ తీయాలని వుందట!
సుమారు 33 ఏళ్ళ క్రితం ప్రకాశం జిల్లా కారంచేడులో దళితుల తాగునీటి చెరువులోకి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పశువులను తోలడంతో చెలరేగిన వివాదం చివరకు కొందరు దళితుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కేసులో తీర్పు రావడానికి 23 ఏళ్లు పట్టింది. అన్నేళ్లు ఒప్పిగ్గా న్యాయం కోసం దళితుల తరపున వాదించిన లాయర్ జీవితకథను సినిమాగా తీయాలనుందని మోహనకృష్ణ ఇంద్రగంటి చెబుతున్నారు. అలాగే చలం, బొజ్జాతారకం… జీవితాలను సినిమాలుగా తీస్తానని పేర్కొన్నారు. కారంచేడు కేసు అప్పట్లో పలు వివాదాలు, సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. లాయర్ బయోపిక్ అంటే వాటిని తిరగ తొడటమే. ఆయనకు వచ్చిన బెదిరింపులు, మన్నింపులు అన్నీ చూపిస్తారేమో!