ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లగడపాటి ఆర్ జి ఫ్లాష్ టీం సర్వే అంటూ నిన్నంతా హోరెత్తించింది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సరళి తెలుసుకునేందుకు ఈ సర్వే చేశారు అని చెబుతూ, 5 ప్రశ్నల ని ప్రజల ముందు ఉంచామని వాటికి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఈ విధంగా ఉందని చెప్పుకొచ్చింది.
Click here for ఆంధ్రాలో తాజా రాజకీయాలపై లగడపాటి టీమ్ సర్వే..!
అయితే ఈ ప్రోగ్రాం చూసిన వారికి పలు సందేహాలు రావడం ఖాయం. ముఖ్యంగా, ఆంధ్రజ్యోతి ప్రకారం- ఇది లగడపాటి సర్వేలకు పనిచేసే ఆర్ జి ఫ్లాష్ టీం ఆంధ్రజ్యోతి కోసం నిర్వహించిన సర్వే. అంటే ఇది నేరుగా లగడపాటి చేయించిన సర్వే కాదు. ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే. అయితే విశ్వసనీయత కోసమో మరెందుకో కానీ, ఈ ప్రోగ్రాం లో లగడపాటి పేరుని ఆంధ్రజ్యోతి యధేచ్చగా వాడుకుంది. గతంలో లగడపాటి, తాను నేరుగా కెమెరా ముందుకు వచ్చి చెబితే తప్ప అది తన సర్వే గా భావించవద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే “లగడపాటి ఆర్ జి ఫ్లాష్ టీం సర్వే” అని చెప్పడం ఆంధ్రజ్యోతి మాటల గారడీ లా భావించాల్సిందే . ఎందుకంటే రేప్పొద్దున లగడపాటి వచ్చి, ఇది నా సర్వే కాదు అని చెప్పినా, ఆంధ్రజ్యోతి కూడా, ఇది లగడపాటి సర్వే అని మేము చెప్పలేదు అని, ఆయనకి పనిచేసే ఆర్ జి ఫ్లాష్ టీం సర్వే అని మాత్రమే చెప్పామని వాదించుకోవచ్చు.
ఆంధ్రజ్యోతి మాటల గారడీ చేసిన మరొక అంశం – ‘ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే’. విద్యావంతులైన ప్రేక్షకులు పాఠకులు ఈ అంశాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, ఒక మోస్తరు ప్రేక్షకులు ఈ మాట వెనకాల ఉన్న అంతరార్థం అంత సులువుగా అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, ఒక జనసేన కార్యకర్త ని , 2019 లో పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి అని అడిగితే, బహుశా 40 అని చెబుతాడు అనుకుందాం. అదే కార్యకర్తని ఇప్పటికిప్పుడు, ఈరోజు ఎన్నికలు పెడితే ఎన్నిసీట్లు అని అడిగితే ఇంకా లీడర్లు జాయిన్ అవ్వలేదు కాబట్టి, ఒక అయిదు లేదా పది సీట్లు వస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి ఇది ( ” ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ” ) కూడా మాటల గారడీ లాంటిదే.
ఇక సర్వే లో, నమ్మశక్యంగా లేనటువంటి మరొక అంశం – ఓట్ల శాతం. గెలిచే పార్టీ ( తెలుగుదేశం) , ప్రతిపక్ష పార్టీ ( వైఎస్ఆర్సిపి) మధ్య 7 శాతం ఓట్ల తేడా చెప్పడం నమ్మశక్యంగా లేదు. రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఒక్క శాతం లేదా రెండు శాతం తేడా గెలుపు ఓటమి లని శాసిస్తూ ఉంటుంది. 1994 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ మట్టికొట్టుకు పోయినప్పుడే 10% ఓట్ల తేడా వచ్చింది. 2004లో తెలుగుదేశం కి 47 సీట్లు వస్తే, కాంగ్రెస్ కి 185 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా తెలుగుదేశం కి 37.59% ఓట్లు వస్తే, కాంగ్రెస్ కి 38.56% ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒక్క శాతం తేడా. అలాంటిది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సమయంలో ఏడు శాతం తేడాతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేలా కనిపిస్తోంది. త్రిముఖ పోటి ఉంటుంది కాబట్టి, లెక్కలు వేరేగా ఉంటాయి అని అనుకున్నా అది ఏ మూడు శాతం అలా ఉంటుంది కానీ, మరి ఏడు శాతం తేడా అనేది అసాధ్యం.
ఇక వైఎస్సార్సీపీ పాదయాత్ర ప్రభావం అస్సలు లేదని, వైయస్ఆర్సీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు అయిన క్రిస్టియన్లు, ముస్లింల వంటి మైనారిటీలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి అని, గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అసలు ఉండదని, జనసేన ప్రభావం కూడా ఎన్నికలలో ఏమాత్రం ఉండదని, చెప్పడం కూడా ఇది లగడపాటి సర్వే కాదు ఆంధ్రజ్యోతి సర్వే అయివుంటుంది అని జనాలు అనుకునేలా చేస్తోంది.
ఏదిఏమైనా సర్వే ఆద్యంతం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే టీవీ ఛానల్ చేసిన సర్వే లాగే ఉంది తప్ప నిజమైన సర్వే లా, అందులోనూ లగడపాటి సర్వేలా నమ్మ గలిగేలా లేదు. పైగా ఇలాంటి మాటల గారడీ లతో ప్రేక్షకులని మభ్యపెట్టగలము అనుకోవడం కూడా ఈ సోషల్ మీడియా కాలంలో సరికాదు.
కొసమెరుపు: బాహుబలి తీసిన రాజమౌళి సినిమాలకు, బాహుబలి తీసిన రాజమౌళికి కథ నందించే విజయేంద్ర ప్రసాద్ తీసిన సినిమాలకు ఎంత తేడా ఉందో, లగడపాటి సర్వే కి, లగడపాటికి పనిచేసిన టీం చేసే సర్వే కి బహుశా అంతే తేడా ఉండవచ్చు. ఆ తేడాను ప్రజలు గుర్తించకుండా, మాటల గారడీతో మభ్యపెట్టడం సాధ్యం కాదు.
– జురాన్