ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న నిరసనకు రానురానూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రా, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై సుబ్రహ్మణ స్వామి స్పందిస్తూ.. కేజ్రీవాల్ ఒక నక్సలైట్ అనీ, అలాంటి వారికి మద్దతు ప్రకటించడమేంటని ఆయన అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులోగా ఎల్జీ కార్యాలయంలోనే కొంతమంది మంత్రులతో కేజ్రీవాల్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సందర్భంగా కేజ్రీవాల్ కి మద్దతు తెలిపారు. ఈ సందర్భాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసేందుకు వాడుకున్నారనీ చెప్పొచ్చు!
కేజ్రీవాల్ నిరసనపై కేంద్రం ఇంతవరకూ స్పందించిందే లేదు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. డియర్ సుప్రీం లీడర్ అంటూ ప్రారంభించి, ఫిట్నెస్ ఛాలెంజ్ లు, యోగా వ్యాయామాలంటూ తమరు బిజీగా ఉన్నారనీ తెలుసు అంటూ ప్రధానిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒక సుదీర్ఘ శ్వాస తీసుకుని, చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఒక్క క్షణం పాటు ప్రధాని చూడాలన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు మంచి చేయాలని పనిచేస్తున్నారనీ, అలాంటి సీఎంతో కలిసి పని చేయాల్సిందిగా అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు. పనిలో పనిగా మీరు కూడా విధులు నిర్వహించండి అని ప్రకాష్ ట్వీట్ చేశారు.
జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య తరువాత నుంచి ప్రధాని మోడీపై సందర్భం దొరినప్పుడల్లా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో మోడీ ప్రచారం చూస్తూ.. ముధోల్ కి చెందిన కుక్కలు సైన్యంలో సేవలందిస్తున్నాయనీ, కాంగ్రెస్ నేతలు వాటిని చూసి దేశభక్తి నేర్చుకోవాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ప్రధానిగారూ.. మీకు ఓట్లు వేసింది కుక్కలు కాదు, మనుషులని గుర్తుంచుకోవాలి’ అంటూ అప్పుడూ ప్రకాష్ రాజ్ మోడీకి గట్టి కౌంటరే ఇచ్చారు. ‘దళితుడి ఇంట్లో ఒక్క రోజు భోజనం చేసినంత మాత్రాన మీరు దళిత నాయకుడు అయిపోతారా, దళిత ఆశాకిరణం అని చెప్పేసుకుంటారా?’ అంటూ కూడా గతంలో ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. మోడీపై విమర్శల విషయంలో ప్రకాష్ రాజ్ అదే టెంపో కొనసాగిస్తున్నారు.