ఢిల్లీలో నీతీ ఆయోగ్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా కనిపించారు. ఎందుకంటే, మోడీ సర్కారుపై విమర్శలు చేయడంతోపాటు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా కూడా నిలిచారు. ఏపీ సమస్యలపై సీఎం చంద్రబాబు సమావేశంలో మాట్లాడటం, మద్దతుగా మమతా బెనర్జీ స్పందించడం ఇవన్నీ తెలిసినవే. అయితే, సాక్షికి ఇదంతా అక్కర్లేదు..! ఒక్క ఫొటో దొరికింది. దాన్ని పట్టుకుని వారికి నచ్చిన విశ్లేషణలు రాసేసుకున్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమార స్వామి, పినరయిలతో ప్రధాని మోడీ పలకరింపుగా మాట్లాడుతూ.. చంద్రబాబు నవ్వుతూ ప్రతిస్పందించారు.
ఇందులో సాక్షికి అర్థమైన కోణం ఏంటంటే… మోడీ ముందు చంద్రబాబు వినయంతో ఒంగిపోయారూ, మోడీ చేతిని ఆయన వదల్లేదూ, మోడీని కడిగేస్తామని ఢిల్లీ బయలుదేరి ఇదేం పనీ అన్నట్టుగా రాసుకొచ్చారు! ప్రధాని చెయ్యి చంద్రబాబు లాక్కుని పట్టుకున్నట్టుగా ఉందని నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారూ, జాతీయ మీడియాలో ఈ ఫొటోపై దుమారం రేగుతోందని విశ్లేషించారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమంటున్నవారు చేయాల్సిన పని ఇదేనా అంటూ వాపోయారు.
సాక్షికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే… రాజకీయాల్లో పోరాటాలకీ వీధి పోరాటాలకీ ఉన్న తేడా! రాజకీయాల్లో పోరాటాలంటే ప్రత్యర్థులతో మాట్లాడకుండా, షేక్ హ్యాండ్ ఇస్తున్నా చెయ్యి తోసేసి, ఎదురుగా నిలబడ్డా ముఖం చాటేసి కోపంతో అలిగి కూర్చుంటారా..? ఓటుకు నోటు కేసు సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. తల్లో జేజమ్మ దిగొచ్చినా చంద్రబాబును కాపాడలేరని కేసీఆర్ అంటే, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చంద్రబాబూ ఆగ్రహించారు. ఆ ఊపులో గవర్నర్ ఇచ్చిన విందులో కేసీఆర్-చంద్రబాబు ఎదురుపడి నవ్వుతూనే పలకరించుకున్నారు. ఆ తరువాత, మళ్లీ విమర్శలు చేసుకున్నారు. అంతెందుకు, తెల్లారితే చాలు చంద్రబాబును విమర్శించడమూ ఆరోపించడమూ పనిగా పెట్టుకున్న జగన్ ఎదుపడ్డా నవ్వుతూనే సీఎం చంద్రబాబును పలకరిస్తారు కదా! అంతమాత్రాన జగన్ చేస్తున్నారని చెప్తున్న పోరాటానికి పసలేదని వైకాపా అనుకుంటుందా..?
ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల స్థాయిలో ప్రోటోకాల్ అనేది ఉంటుంది. పలకరింపులు, కరచానాలు అనేవి తప్పని అంశాలు. పద్ధతి ప్రకారం ఆయా పదవులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలి. ప్రధానికి చంద్రబాబు షేక్ హేండ్ ఇచ్చారూ, ఇదేనా పోరాటం అంటూ అత్యుత్సాహంతో విశ్లేషణలు చేసేయడమేనా విలువలతో కూడిన జర్నలిజం అంటే..? సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని దీనికి ప్రామాణిక ఆపాదించడం సరైందో కాదో వారే ఆలోచించుకోవాలి.