విభజన హామీల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న పోరాటంపై కేంద్రం కనీస మాత్రం గౌరవం కూడా చూపించడం లేదు. తాజాగా రైల్వేజోన్ విషయంలో కేంద్రరైల్వే మంత్రి పియూష్ గోయల్.. తెలుగు ప్రజలను అమానించే విషయంలో మరో అడుగు ముందుకెశారు. విభజన చట్టంలో రైల్వేజోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని.. నాలుగేళ్లుగా దాన్ని కేంద్ర రైల్వే శాఖ పరిశీలిస్తూనే ఉందన్నారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి కూడా పరిశీలిస్తున్నానన్నారు. రైల్వే శాఖ ప్రగతిపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ రైల్వే జోన్ పై ఆయన ఈ వెటకారాలు చేశారు.
విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిపై కేంద్రం ఇదే తరహా పాట పాడుతోంది. చట్టంలో కేవలం పరిశీలించమనే ఉందని.. తాము పరిశీలిస్తున్నామని చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేంద్రం అవమానిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు మాత్రం… అదిగో.. ఇదిగో .. ఇచ్చేస్తామని చెప్పుకొచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా… ఇదే విషయాన్ని బల్ల గుద్దీ మరీ చెప్పేవారు. నిన్నామొన్నటిదాకా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఎంపీ హరిబాబు, విశాఖ నుంచే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు… ఏ ప్రెస్‌మీట్ పెట్టినా ముందస్తుగా రైల్వేజోన్ తీసుకొచ్చేస్తున్నాం అని చెబుతూంటారు. కానీ కేంద్రం పరిశీలనలో ఉందని మాత్రం చెప్పడం లేదు. అలా ఎంత కాలం పరిశీలిస్తారో కూడా చెప్పకుండా… ప్రజల్ని మోసం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
నిజానికి రైల్వేజోన్ అనేది.. విశాఖ వాసుల దశాబ్దాల డిమాండ్. కొద్ది రోజుల కిందటి వరకు.. రైల్వేజోన్‌కు ఒడిషా అభ్యంతరం చెబుతోందని కేంద్రం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమపై దుష్ప్రచారం జరుగుతోందని గ్రహించిన ఒడిషా ఎంపీలు…తాము విశాఖ రైల్వేజోన్ కు ఏ మాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేశారు. ఒడిషాలో ఉన్న రైల్వే డివిజన్లను మినహాయించి ఏపీలో ఉన్న డివిజన్లతోనే కేంద్రం రైల్వేజోన్ ప్రకటించబోతోందని… వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. దానికి విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకంటున్నారు. చట్టంలో పరిశీలించమని ఉందని.. తాము పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ… కేంద్ర ప్రభుత్వం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. చట్టంలో సాధ్యం అవునో కాదో .. అధ్యయనం చేయమని మాత్రమే ఉందని అది పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.
చట్టాలు చేసేటప్పుడు వాడే భాష ప్రకారం.. పరిశీలించమనే ఉంటుందని.. దానర్థం… ఊరకనే అలా పరిశీలించి వదిలేయడం కాదని… నిపుణులు చాలా రోజులుగా చెబుతూనే ఉన్నారు. ఆ హామీని నెరవేర్చాలనే అలా రాస్తారని… ఒక వేళ సాధ్యం కాదని రిపోర్టులొస్తే.. అడ్డంకులు ఏమిటో పరిశీలించి… వాటిని అధిగమించి.. చట్టాలను అమలు చేయాలనేది… ఆ పదాల సారాంశమని చెబుతున్నారు. ఈ విషయం కేంద్రానికి తెలియనిది కాదు. ఉద్దేశపూర్వకంగా విభజన చట్టంలోని అంశాలకు కొత్త భాష్యం చెబుతూ కేంద్రమంత్రులు తెలుగువారిని అవమానపరుస్తున్నారు.