డీజే, నా పేరు సూర్య వైఫల్యాల తరవాత కూడా అల్లు అర్జున్ తన జోరు తగ్గించడం లేదు. వరుసగా కథలు వింటున్నాడు.. దర్శకుల్ని ఓకే చేసేసుకుంటున్నాడు. పరాజయాల భారం నుంచి బయటపడడానికి పని చేయడం ఒక్కటే దారి అనుకున్నాడో, లేదంటే దర్శకుల్ని ముందు ఖరారు చేసుకుంటే, ఆ తరవాత తీరిగ్గా… కథల్ని సెట్ చేసుకోవచ్చని అనుకుంటున్నాడో తెలీదు గానీ… అల్లు అర్జున్ లిస్టులో ఇప్పుడు చాలామంది దర్శకులు ఉన్నారు. విక్రమ్ కె.కుమార్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి బన్నీ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటిలో ముందుగా విక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది. ఆ తరవాతే త్రివిక్రమ్, సూరిలతో. ఇప్పుడు ఈ జాబితాలో మరో దర్శకుడు కూడా చేరాడని టాలీవుడ్ టాక్. శేఖర్ కమ్ములతో పనిచేయడానికి అల్లు అర్జున్ ఉత్సాహం చూపిస్తున్నాడని, ఈ కాంబినేషన్ కూడా దాదాపుగా ఖాయమైనపోయినట్టే అని తెలుస్తోంది. క్లాస్ దర్శకులతో పనిచేయడం అంటే.. బన్నీకి ఇష్టమే. కానీ లోలోపల భయం. అందుకే చాలామంది దర్శకుల్ని బన్నీ పక్కన పెట్టేశాడు. గత కొన్నేళ్లుగా మాస్ మంత్రమే జపిస్తున్న బన్నీకి మంచి హిట్లే పడ్డాయి. కానీ డీజే. నా పేరు సూర్య నిరాశ పనిచాయి. ఈ దశలో మాస్ కంటే.. క్లాసే నయం అన్న నిర్ణయానికి వచ్చాడేమో. వరుసగా క్లాస్ దర్శకుల కథలకు ఓటేస్తున్నాడు.
సురేందర్ రెడ్డి, విక్రమ్, త్రివిక్రమ్.. వీళ్లలో ఎవరూ ఊర మాస్కాదు. శేఖర్ కమ్ముల అయితే… టూ మచ్ క్లాస్. దీన్ని బట్టి…. అల్లు అర్జున్ గేమ్ ప్లాన్ మారినట్టు అర్థం అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో క్లాస్ దర్శకుల హవా కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకున్నా, మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని గమనించినా.. బన్నీ ఎంచుకున్న దారి సరైనదే అనిపిస్తుంది. మరి ఆ తరహా పాత్రలు, కథలు బన్నీకి సూటవుతాయా? అనేదే తేలాల్సివుంది. త్రివిక్రమ్ కథలకు బన్నీ సూటవుతాడన్నది ఇది వరకే తేలిపోయింది. ఆ విషయంలో కంగారు పడాల్సిన పనిలేదు. సురేందర్‌తో ఆల్రెడీ రేసుగుర్రం లాంటి హిట్ సినిమా చేశాడు బన్నీ. ఈ కాంబో విషయంలోనూ అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇక విక్రమ్, శేఖర్ కమ్ములలు ఏం చేస్తారో, బన్నీని ఎలా చూపిస్తారో.? మొత్తానికి బన్నీ మైండ్ సెట్ మారింది. ఈ మార్పు దేనికి సంకేతమో కాలమే చెప్పాలి.