హైదరాబాద్ లో కొత్త సచివాలయం నిర్మించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి, ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ లో ఇప్పటికే కొన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా కూడా.. ఏపీ సెక్రటేరియట్ ఆంధ్రాకి వెళ్లిపోయి చాన్నాళ్లయింది. సచివాలయం వాస్తు బాలేదనీ, అందుకే కేసీఆర్ అక్కడికి రావడం లేదనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్న సంగతీ తెలిసిందే. కారణాలు ఏవైనా.. కొత్త సచివాలయం కోసం బైసన్ పోలో గ్రౌండ్ కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను సీఎం కోరిన సంగతి తెలిసిందే. స్థలం బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు కూడా. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు గతంలో నిరసనలు చేశారు. ఓటింగ్ కూడా నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఇదే అంశంపై పోరాటం పెంచుతా అంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధానిని కలిసి పది అంశాలతో ఒక వినతి పత్రం ఇచ్చారు. దీన్లో బైసన్ పోలో గ్రౌండ్ కూడా ఒకటుంది. ఇప్పటికే ఈ స్థలాన్ని అప్పగించేందుకు రక్షణ శాఖ సుముఖత వ్యక్తం చేసిందనీ, ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రక్షణ శాఖ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ప్రధాని మోడీని కోరారు. దీనిపై వీహెచ్ మరోసారి మండిపడ్డారు. సువిశాలమైన సచివాలయం అందుబాటులో ఉండగా, కొత్తది కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బైసన్ గ్రౌండ్ లో ఎంతోమంది క్రీడాకారులు తయారౌతున్నారనీ, దాన్ని ప్రభుత్వం లాక్కుంటే వారి భవిష్యత్తు నాశనం చేసినట్టే అన్నారు.
తన ప్రాణాలు పోయినా ఆ గ్రౌండ్ ను రాష్ట్ర ప్రభుత్వపరం కానీయకుండా ఉద్యమిస్తానని వీహెచ్ ప్రకటించారు. నిజానికి, గతంలో ఆయనే స్వయంగా చొరవ తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేసి… గ్రౌండ్ అప్పగింతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇప్పుడు అదే అంశం తెరమీదికి వచ్చేసరికి ఉద్యమిస్తా అంటున్నారు. అయితే, కొత్త సచివాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా వీహెచ్ ఒక్కరే బలంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అనూహ్య మద్దతు కనిపించకపోవడం గమనార్హం. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో కూడా సొంత పార్టీ నుంచి వీహెచ్ కు ఆశించిన సాయం అందలేదు. తాజాగా మరోసారి ఉద్యమిస్తా అంటున్న నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా ఈ అంశాన్ని కాంగ్రెస్ పెద్దదిగా చూస్తుందా లేదా అనేది కూడా సందేహమే.