భాజపా నాయకురాలు పురందేశ్వరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. టాపిక్ ఏంటంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్! నీతీ ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొనడం, ఏపీ సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందుంచడం తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటికే ఏపీ భాజపా నేతలు వరుసగా స్పందించిన తీరూ చూస్తున్నాం. సమస్యల్ని గాలికి వదిలేశారనీ, ఢిల్లీ వెళ్లి వేరే పనులు చూసుకుంటున్నారంటూ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్ననే విమర్శించారు. ఇదే క్రమంలో ఇప్పుడు పురందేశ్వరి కూడా మాట్లాడారు. నీతీ ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేవనెత్తిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పలేదంటూ రాష్ట్రంలో టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆమె ఖండించారు. ఆంధ్రాకి కేంద్రం చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసిందని చెప్పారు.
ఇక, ఢిల్లీలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ గురించి కూడా ఆమె మాట్లాడారు. చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమార స్వామి, పినరయి వంటివారి మధ్య భావసారూప్యత లేదన్నారు. అలాంటివాళ్లు ఎన్నాళ్లు కలిసి పనిచెయ్యగలరనీ, ఎన్నాళ్లు ఐకమత్యంతో ఉంటారో కూడా చూద్దామని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. ఏపీలో వైకాపా, జనసేన, భాజపాలు కలిసి పనిచేస్తాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె ఖండించారు. ఆ రెండు పార్టీల వెనకా భాజపా ఉందనడం సరికాదన్నారు.
దేశంలో భాజపాను వ్యతిరేకించే పార్టీలన్నీ ఒకేఒక్క భావసారూప్యంతో పనిచేస్తున్నాయి. భాజపాకి మరో అవకాశం ఇవ్వకూడదన్న పూనికతో ఉన్నాయి. ఎంతగా అంటే.. యూపీలో ఉప్పు నిప్పుల్లా ఉండే ఎస్పీ, బీఎస్పీలు కూడా కలిసి భాజపాకి అవకాశం లేకుండా చేస్తున్నాయన్నది పురందేశ్వరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భావసారూప్యతే ఇప్పుడు ఇతర రాష్ట్రాల మధ్య, వివిధ పార్టీల మధ్య పెరుగుతోంది. దీన్ని గుర్తించారు కాబట్టే భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఒక మెట్టు దిగి, దూరమౌతున్న మిత్రులను దగ్గర చేసుకునే పనిలోపడ్డారు కదా.
సరే, పురందేశ్వరి చెప్పిన ఇదే భావసారూప్యతను మరో కోణం నుంచి విశ్లేషిస్తే… ఏపీలో భాజపా, జనసేన, వైకాపాలు ముఖ్యమంత్రి చంద్రబాబును ముక్తకంఠంతో విమర్శిస్తున్నాయి. టీడీపీ వ్యతిరేకత అనే భావసారూప్యత ఈ మూడు పార్టీల్లో చాలా స్పష్టంగా ఉంది. భావసారూప్యత లేనివారు కలిసి ఉండలేరనే సిద్ధాంతానికి మరో పార్శ్యం ఏంటీ.. ఉన్నవారు కలిసి ఉండగలరనే కదా. ఆ లెక్కన టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ మూడు పార్టీలు ఎన్నికల నాటికి కలిసే అవకాశం లేదని ఎలా అనుకుంటాం..? భాజపా నేతలు వైకాపాని విమర్శించరు, వైకాపా నేతలు భాజపా జోలికి వెళ్లరు, జనసేనను వైకాపా, భాజపాలు కూడా విమర్శించవు. ఈ మూడు పార్టీలూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోవడం కూడా భావసారూప్యతే.