ఏపీ భాజపా నేతలు చేస్తున్నది ఉత్త హడావుడి మాత్రమే అని తేలిపోయింది..! ఆంధ్రా భాజపా నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఇస్తున్న విలువ ఎంతో స్పష్టమైపోయింది..! ఆంధ్రాకి అన్నీ చేశామని ఏపీ భాజపా నేతలు అంటారు. ఈ మధ్య కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ అయితే… ఏపీని భాజపా నడుపుతోందన్నట్టుగా మాట్లాడారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనీ, అదెలా తీసుకోవాలో ఆంధ్రాకి అర్థం కాలేదని గడచిన రెండ్రోజులుగా భాజపా నేతలు ఏకరువు పెడుతున్నారు. అయితే, గతవారంలోనే కన్నా ఢిల్లీ వెళ్లి, ప్రధానికి ఓ 12 అంశాలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. రైల్వేజోన్ తోపాటు దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విజయవాడ వైజాగ్ మెట్రో ప్రాజెక్టులు.. ఇలాంటి అంశాలపై వెంటనే స్పందించాలని తాను కోరగానే.. ప్రధానమంత్రి మోడీ తప్పకుండా, త్వరలోనే ఇచ్చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పుకున్నారు.
కానీ, ఇప్పుడేమైందీ… విశాఖ రైల్వేజోన్ మీద ఆ శాఖమంత్రి కామెడీ చేశారు కదా! పరిశీలించాలని మాత్రమే ఉందని మాట్లాడారు. ఇది ఏపీ ప్రజలను మోసం చేసే ప్రకటన అనేది కొత్త విషయమేం కాదు, ఇది కొత్తగా జరిగిన మోసం అంతకన్నా కాదు! కానీ, ఈ క్రమంలో ఏపీ కమలనాథులను కూడా భాజపా మోసం చేస్తోంది..! 12 అంశాలపై స్పందిస్తామని కన్నాకి మోడీ హామీ ఇచ్చారు కదా! దీన్లో విశాఖ రైల్వే జోన్ పై ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టు కేంద్రం స్పందించింది. మరి, ఏపీ భాజపా నేతలకు జాతీయ నాయకత్వం ఇచ్చిన గుర్తింపు ఎక్కడున్నట్టు..? మొన్నటికి మొన్న, కడప ఉక్కు కర్మాగారంపై కూడా ఇలానే, అసాధ్యమని భాజపా చెప్పింది.
కేంద్ర మంత్రులు, ప్రభుత్వ స్థాయిలో ఏపీకి సంబంధించిన అంశాలపై స్పందన ఒకలా ఉంటోంది, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి అంతా చేసేస్తున్నాం అని నేతలు చేస్తున్న ప్రకటనల తీరు మరోలా ఉంటోంది! ఈ తేడా చూస్తుంటే… ఇంతకీ ఏపీ భాజపా నేతల్ని జాతీయ నాయకత్వం పట్టించుకుంటోందా అనే అనుమానం కలుగుతోంది. వీరి మాటలకు సొంత పార్టీ అధినాయకత్వంలో విలువ ఉంటోందా అనే ప్రశ్న తలెత్తుతోంది! ఏపీలో సొంతంగా పోటీ చేసేస్తామని ఇక్కడి నేతల హడావుడేగానీ… వాస్తవంలో ఏపీలో వారికి దక్కేదేమీ ఉండదనేది అమిత్ షా అంచనా వేయలేని పరిస్థితైతే కాదు కదా..? రాజకీయంగా ఏపీలో ఏదో అద్భుతం చేయగలమన్న నమ్మకం జాతీయ నాయకత్వానికి లేదు. తాజా వైఖరితో స్పష్టమౌతున్న అంశం ఏంటంటే.. అలాంటి అద్భుతాలు చేయగల సామర్థ్యం సొంత పార్టీ రాష్ట్ర నేతల్లో లేదనేది కూడా అన్యాపదేశంగా కేంద్రం చెబుతున్నట్టుగానే అర్థం చేసుకోవాలి.