ముందుగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో స్టార్ట్ చేద్దాం..! ఎందుకంటే, ఆ మధ్య.. అదేనండీ జె.ఎఫ్.సి. అంటూ జనసేనాని ఒక కమిటీ ఏర్పాటు చేశారు కదా! దాన్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏమన్నారూ.. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతాడనీ, సునామీ సృష్టిస్తాడన్నట్టుగా మాట్లాడారు. గతం గతః. తాజాగా, ఇప్పుడు ఏమంటున్నారంటే… పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చారనీ, కాబట్టి ఇప్పట్లో ఆయన శక్తిని అంచనా వేయలేమన్నారు. అంచనా వెయ్యాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలన్నారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, ఆయన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నారు. చంద్రబాబుకు ఉన్న ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలు జగన్ దగ్గర లేవన్నారు. జగన్ దగ్గర పనిచేస్తున్నవారిలో అలాంటి నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా ఉన్నారో లేదో తనకు తెలీదన్నారు! ఈ విషయంలో చంద్రబాబుకి జగన్ సరిసమానం కాలేన్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం ఉన్నంత బలంగా రాష్ట్రంలో ఏ పార్టీ లేదన్నారు. ఆ బలంలో 50 శాతం మాత్రమే గతంలో కాంగ్రెస్ ఉండేదన్నారు. ఇవాళ్ల ఆ స్థాయిలో కూడా ఏ పార్టీ లేదన్నారు. అయితే, అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ వేవ్ మీద ఆధారపడి ఉంటాయన్నారు. ఆ వేవ్ ఇవాళ్ల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. కానీ, ఆ వేవ్ ని మార్చగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని ఉండవల్లి విశ్లేషించారు.
ఉండవల్లి రొటీన్ తీరుకి భిన్నమైన మాటల్లా వినిపిస్తున్నాయి కదా! ఎందుకంటే, ఏపీలో ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నట్టుగా విశ్లేషణలు ఆయనే చేస్తారు! పవన్ తిరుగులేని సమర్థ నాయకుడనీ ఆయనే అన్నారు. ఇక, జగన్ గురించి మొదట్నుంచీ.. ఏపీకి ఆయనే ప్రత్యామ్నాయం అన్నట్టుగా అన్యాపదేశంగా వెనకేసుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఇవాళ్ల ఈ ముగ్గురిపై మారిన వైఖరి ఆయన మాటల్లో కనిపిస్తుండటం విచిత్రం..! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామర్థ్యాన్ని ఉండవల్లి మెచ్చుకోవడమంటే ఆశ్చర్యమే. ఇదే క్రమంలో జగన్ ను నైపుణ్యాలు చాలా తక్కువ అని వ్యాఖ్యానించడమూ మరో ఆశ్చర్యం. ఏదేమైనా, ఇన్నాళ్లకు ఉండవల్లి వాస్తవాలు మాట్లాడారు.