ప్రభాస్ సినిమా అంటే అటెన్షన్ పెరిగిపోతోంది. బాహుబలి ఇచ్చిన మైలేజీ అలాంటిది. సాహో గురించి ఏ చిన్న కబురు తెలిసినా.. అది టాక్ ఆఫ్ ది టౌనే. సాహో… తరవాత ప్రభాస్ చేయబోయే సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడిందిప్పుడు. సాహో తరవాత. ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా మొత్తం యూరప్‌లోనే జరగబోతోంది. అయితే.. ఇండియాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. అది కూడా యూరప్‌కి మ్యాచింగ్గానే. వీటి కోసం కొన్ని సెట్లు రూపొందించే పనిలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ భారీ ఓడ, రైలు, హెలీకాఫ్టర్ అవసరం అవుతున్నాయట. హెలీకాఫ్టర్ అయితే… రియాలిటీ కోసం నిజమైనదే వాడేయొచ్చు. ఓడ, రైలు అంటే కష్టం కదా? అందుకోసం కృత్రిమంగా తయారు చేస్తున్నారట. ఈ సినిమా కోసం రైలు, ఓడ సెట్లని రూపొందిస్తారని, హెలీకాఫ్టర్ని కూడా తయారు చేస్తారని సమాచారం. ఇదంతా ప్రొడక్షన్ డిజైనర్, కళా దర్శకుడైన రవీందర్ నేతృత్వంలో రూపొందుతున్నాయి. మగధీరలో రవీందర్ వేసిన హెలీకాఫ్టర్ సెట్‌కి మంచి పేరొచ్చింది. తనకున్న ఇంజనీరింగ్ తెలివితేటలతో కృత్రిమమైన హెలికాఫ్టర్ తయారు చేయించి, గాల్లోకి ఎగిరేలా చేశాడు రవీందర్. ఇప్పుడు ఓ భారీ షిప్‌ని రూపొందిస్తున్నట్టు సమాచారం. రైలు పెట్టెల్ని సెట్లుగా రూపొందించడం మామూలే. కానీ ఇది యూరప్ నేపథ్యంలో సాగే సినిమా కదా….అక్కడి స్ట్రక్చర్‌ని పోలిన రైలు కావాలి. అందుకోసం చిత్రబృందం యూరప్ వెళ్లి స్కెచ్చులు తయారు చేసే పనిలో ఉంది. ఇక ఓడ ఎలా ఉంటుందో..? ఈమూడు సెట్టింగులూ ఈ సినిమాకి కీలకమని, అందుకే ఖర్చు విషయంలో రాజీ పడకుండా వాటిని భారీ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఏర్పాటు జరుగుతున్నాయని తెలుస్తోంది.