ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా ఒకవెలుగు వెలిగినకృష్ణ యాదవ్, స్టాంపు పేపర్ల కుంభకోణంలో జైలుకి వెళ్ళివచ్చిన తరువాత, అతి కష్టం మీద మళ్ళీ తెదేపాలో చోటు దక్కించుకొన్నారు. తెలంగాణా తెదేపా ఉపాధ్యక్షుడుగా ఉంటున్నారు కూడా. కానీ పార్టీలో ఆయనను పట్టించుకొనేవారే కనబడటం లేదు. ఈరోజుల్లో రాజకీయాలలో నోరున్నవాడికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆయన ప్రతిపక్షాల విమర్శలకు భయపడుతున్నందునో ఏమో ఇదివరకులాగా దైర్యంగా మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడలేకపోవడంతో క్రమంగా అయన ఉనికిని కోల్పోయారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఆయనను ఎవరూ పట్టించుకోకపోతే అందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆ కారణంతోనే అసంతృప్తికి గురయిన ఆయన తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. కానీ ఇప్పుడు కూడా పార్టీ పట్టించుకోకపోయినట్లయితే ఆయన సెల్ఫ్ గోల్ చేసుకొన్నట్లవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీలో కొనసాగలేరు. అలాగని పార్టీని వీడినా ఏ పార్టీ ఆయనకు ఆహ్వానం పలికేందుకు సిద్దంగా లేదు. కనుక అప్పుడు పార్టీలో కొనసాగడం ఇంకా కష్టమవుతుంది. పార్టీలో చురుకుగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్లే పరిస్థితులు బాగోలేవని మౌనంగా ఉంటునప్పుడు, కృష్ణ యాదవ్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి అసంతృప్తి వ్యక్తం చేయడం సెల్ఫ్ గోల్ చేసుకొన్నట్లే అవుతుంది.