సామాజిక డ్రామాలు ఆడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తెర తీశారంటూ ప్రతిపక్ష పార్టీ పత్రిక సాక్షి మరోసారి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. కొన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని రాజకీయంగా చిత్రించే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని కొన్ని సామాజిక వర్గాల హోదాల మార్పు విషయమై అధ్యయనం చేయాలంటూ ఒక ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నివేదిక వీలైనంత త్వరగా రావాలనీ, తద్వారా ఆయా కులాలను ఎస్సీలుగా, ఎస్టీలుగా గుర్తించే ప్రక్రియను పూర్తిచేయాలని భావించింది.
అయితే, ఈ ప్రయత్నాన్ని కులాల పేరిట మోసం చేసేందుకు చంద్రబాబు సర్కారు మరో డ్రామాకు తెర తీశారంటూ వైకాపా పత్రిక అభివర్ణించింది. గతంలోనూ కాపులకు ఇలానే హామీ ఇచ్చారనీ, కానీ దాన్ని సీఎం గాలికి వదిలేశారని విమర్శించింది. గత ఎన్నికలకు ముందు వడ్డెర, మత్స్య కారులను ఎస్టీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేసింది. నిజానికి, కాపుల రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే రాష్ట్రం వంతు చేయాల్సిన ప్రయత్నం జరిగిపోయింది. కాపుల్ని బీసీల్లో చేర్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై మంజునాథన్ కమిషన్ అధ్యయనం, అనంతరం అసెంబ్లీ తీర్మానం కూడా జరిగింది. ఇది ప్రభుత్వం తరఫున జరిగిన ప్రయత్నంగా సాక్షికి అనిపించదు! ఇక, ఇతర కులాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనానికి కమిషన్ వేస్తే… దాన్ని కూడా రాజకీయమే అంటారు.
ప్రభుత్వం చేస్తే అది రాజకీయం, అదే పని జగన్ చేస్తే న్యాయం అన్నట్టుగా సాక్షి తీరు ఉంటోంది..! పాదయాత్రలో భాగంగా కాపులకి, బీసీలకు, ఇతర కులాలకు హామీలు ఇచ్చుకుంటూనే వెళ్తున్నారు కదా. కాపు సోదరుల గుండెల్లో నిలిచిపోయేలా తాను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొని.. రజకులను ఎస్సీలుగా గుర్తించే చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారే! కురువ, కురుబ కులాలను కూడా ఎస్టీలుగా గుర్తిస్తాననీ, బోయలు, వాల్మీకి కులాలవారిని ఎస్టీలుగా గుర్తిస్తాననీ జగన్ హామీలు ఇచ్చారు కదా!
అంటే, కులాల వారీగా జగన్ హామీలు ఇస్తే అది సామాజిక న్యాయం అన్నమాట! అవే కులాల సమస్యల అధ్యయనం చేసి, వారి వర్గీకరణకు ప్రభుత్వం ప్రయత్నించేందుకు ఒక కమిషన్ వేస్తే అది సామాజిక నాటకమని సాక్షి అభివర్ణిస్తోంది. సీఎం చేస్తున్న ప్రయత్నం మోసం అని చెబుతారు, జగన్ ఇస్తున్న హామీలు గొప్ప అంటారు! జగన్ ప్రస్తుతం ఇస్తున్నవి కేవలం హామీలే మాత్రమే. అవి కూడా తాను ముఖ్యమంత్రి కావాలన్న పదవీ కాంక్ష నుంచి పుట్టుకొచ్చినవే కదా.