ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నిటికీ ఒకే మంత్రం జపిస్తున్నారు! రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోవాలంటే… రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే అంటున్నారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ తో సహా అన్నింటినీ ఏర్పాటు చేస్తామని రఘువీరా మరోసారి హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ 48వ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా భాజపా పాలన ఉంటోందనీ, రాజ్యాంగాన్నీ పార్లమెంటునూ దేశాన్ని కూడా తాకట్టుపెడుతోందని రఘువీరా ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలుపెట్టిందనీ, భాజపాను నిజాయతీగా వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఐక్యం చేస్తోందన్నారు. అన్ని పార్టీలతో కలిసి 2019లో యూపీయేని అధికారంలోకి తీసుకురావడం కోసం రాహుల్ నడుం బిగించారన్నారు. రాహుల్ వెంట అనేకమైన పార్టీలు కలిసి ప్రయాణం చేసేందుకు ముందుకొస్తున్నాయన్నారు.
భాజపాకి వ్యతిరేకంగా పార్టీలు ఐక్యమౌతున్నాయని రఘువీరా చెప్పింది వాస్తవమే. కానీ, ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో నడవాలని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, కాంగ్రెసేతర భాజపాయేతర కూటమి అనే ఆలోచనే కూడా ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చల్లో ఉంది. రాహుల్ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ పార్టీ అజెండా మాత్రమే. భాజపాని ఎదుర్కోవాలంటే రాహుల్ ని ముందువరుసలో నిలబెట్టాలనే ఆలోచన ఇతర పార్టీల చర్చల్లోనే లేదు. భాజపాయేతర పార్టీలను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ కే ఉంది.
రాష్ట్రం విషయానికొస్తే… ఏపీలోని సమస్యలన్నింటికీ రాహుల్ ప్రధాని కావడమే పరిష్కారం అన్నట్టుగా రఘువీరా మాట్లాడుతున్నారు. దానికంటే ముందు రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై భరోసా పెంచే ప్రయత్నం ఏదీ జరగడం లేదు. వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా కాంగ్రెస్ మారడానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా ఇంకా మొదలుకాలేదు. పీసీసీ అధ్యక్షుడుగా రఘువీరా కృషి ఏంటనేది కూడా వారే చెప్పలేని పరిస్థితి. ఆయన ఈ మధ్య రాష్ట్రంలో పార్టీ సంగతి వదిలేసి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అజెండానే మాట్లాడుతున్నారు. అదీ ముఖ్యమే, కానీ.. దానికంటే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అనేది రఘువీరా పరిధిలోని ప్రధానాంశంగా ఉండాలి కదా!