పవన్ కల్యాణ్ సుపుత్రుడు అకీరా గురించి తెలియని వాళ్లుండరు. అకీరా మీడియా ముందుకొచ్చింది లేదు. తను మాట్లాడింది లేదు. `నా కొడుకు అకీరా` అంటూ పవన్ కూడా చెప్పుకున్నదీ పెద్దగా లేదు. కానీ… అకీరా గురించి ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా, అతని ఫొటో ఒక్కటి బయటకు వచ్చినా… పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. `జూ.. పవన్` అంటూ పిలవడం మొదలెట్టారు. యంగ్ పవర్ స్టార్ అంటూ రేపో మాపో బిరుదులు కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు. అకీరా ఎప్పుడో ఒకప్పుడు సినిమాల్లోకి రావడం తథ్యం. రేణూ దేశాయ్‌కీ ఆ ప్లాను ఉంది. అందుకే అప్పుడప్పుడూ అకీరా ఫొటోల్ని షేర్ చేస్తూ ఉత్సాహ పరుస్తోంది. ‘సినిమాల్లోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది’ అని చెప్పడం వెనుక… ‘తప్పకుండా హీరో అవుతాడు’ అన్న మాట ధ్వనిస్తోంది.
కాకపోతే రేణు మాటలకూ చేతలకూ పొంతన కుదరడం లేదు. వీలైనప్పుడల్లా పవన్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతోంది. ‘పవన్ ప్రభావం పడకుండా పెంచాలనుకుంటున్నా… అందుకే జూ. పవన్ అని పిలవొద్దు’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి కామెంట్ చేసింది రేణు. అలా చేస్తే… ఆ ఫ్యాన్స్‌ని బ్లాక్ చేస్తానని హెచ్చరించింది. ఎంత కాదన్నా… పవన్ వారసుడిగానే అకీరా సినీ రంగ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. ఓ అనామకుడిగా, రేణూ దేశాయ్ కొడుకుగా సినిమాల్లోకి రావడానికీ, పవన్ వారసుడిగా రావడానికీ చాలా తేడా ఉంది. మెగా హీరోల సినిమాలకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ అండగా ఉంటుందో, రేపు అకీరా వచ్చినా.. అదే స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ స్టామినా అది. దాన్ని రేణు వద్దనుకోవడం పొరపాటే అవుతుంది. అకీరాని హీరోగా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వక పోవడమే మంచిది. పవన్ తనయుడిగా అకీరాని చూడనివ్వను అనుకున్నప్పుడు అకీరా ఫొటోల్ని సోషల్ మీడియాలో రాకుండా చూసుకోవాలి. ఫ్యాన్స్ చూడాలని పోస్టులు పెట్టడం ఎందుకు? మళ్లీ వాళ్లనే బ్లాక్ చేస్తానని హెచ్చరించడం ఎందుకు..? అకీరాని హీరోగా చూడాలన్నది రేణు ఆశ. దాన్ని కాదనలేం కూడా. అకీరాలో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు. కానీ.. తన సొంత కాళ్లపై నిలబడేంత వరకూ పవన్ కల్యాణ్ కొడుకు అనే ట్యాగ్ లైన్ తప్పని సరి. ఈ విషయం రేణు మర్చిపోతోంది.