విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో… కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏకంగా కేబినెట్ సమావేశానికే డుమ్మాకొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు విశాఖ జిల్లాలో అదీ కూడా.. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. జిల్లా మంత్రిగానే కాదు.. ఎమ్మెల్యేగానూ.. కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాల్సిన గంటా.. పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు పర్యనటలో కూడా పాల్గొనడం లేదని… ఆయన వర్గీయులు.. మీడియాకు లీకులు ఇస్తున్నారు. అత్యవసర పని మీద బెంగళూరు వెళ్తున్నారని చెప్పుకొస్తున్నారు. అదే నిజమై.. ముఖ్యమంత్రి పర్యటనకు సైతం గంటా డుమ్మా కొడితే… ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమైనట్లేనన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా గంటా వ్యవహారశైలిపై కాస్తంత వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి అయ్యన్న పాత్రుడుతో ఏ మాత్రం సఖ్యతగా ఉండకపోవడంతో పాటు.. కాపు ఉద్యమం సమయంలో… ప్రభుత్వాన్ని చురుగ్గా ఢిపెండ్ చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం టీడీపీ అధినేతలో ఉంది. మంత్రిగా ఆయన పనితీరుపై కూడా.. రెండు, మూడు సార్లు కేబినెట్ సమావేశాల్లో మందలించినట్లు కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకి వద్దామనుకుంటున్న పలువురు సీనియర్ నేతలను… రాకుండా గంటా అడ్డుపడుతున్నారు. కొణతాల రామకృష్ణ, సబ్బంహరి లాంటి నేతలు.. తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు కోసం .. ఎదురు చూస్తున్నారు. వీరు అయ్యన్నతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దాడి వీరభద్రరావు కూడా.. చంద్రబాబు ఆహ్వానిస్తే పార్టీలోకి వస్తానని చెబుతున్నారు. వీరందరూ పార్టీలో చేరిక ఆలస్యం కావడానికి గంటానే అన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది.
ఇక గంటా శ్రీనివాసరావు కూడా.. గతంలో ఉన్న బలంగా లేరు. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. అప్పట్లో గంటా ఓ వర్గాన్ని మెయిన్‌టెయిన్ చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ప్రస్తుత విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్.. అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న కన్నబాబు రాజు, చింతలపూడి వెంకట్రామయ్యలు కలసి టీడీపీలో చేరారు. ప్రస్తుతం వీరెవరూ గంటాతో లేరు. అనకాపల్లి ఎంపీ అయితే.. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ సీటుపైనే కన్నేశారు. రాజకీయంగా ఇప్పుడు గంటా శ్రీనివాస్ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఏ విధంగా చూసినా పరిస్థితులు గంటాకు అనుకూలంగా లేవు. అయినా.. గంటా శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా మీడియా ముందుకు రాకపోయినా.. కనీసం చంద్రబాబు పిలిచి మాట్లాడతారన్న భావనలో ఉండి ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత గంటా అసంతృప్తిని వేరే రకంగా అర్థం చేసుకుంటే మాత్రం.. పరిస్థితులు వేరేలా ఉంటాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి గంటా వ్యవహారంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.