విశాఖ విమాశ్రయానికి వచ్చే విమాన రాకపోకలపై… కేంద్ర రక్షణ శాఖ ఒక్కసారిగా ఆంక్షలు విధించింది. నేవీ అవసరాలకోసం.. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు.. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. ప్రతి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, రాత్రి 7 నుంచి 9 వరకు .. ఆంక్షలు విధించారు. నిజానికి ఆ సమయంలోనే ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా ఆశ్చర్యపరిచింది. వెంటనే కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ ద్వారా అసంతృప్తి తెలిపారు. ఆంక్షలను తొలగించాలని కోరారు.
విశాఖ విమానాశ్రయం నేవీ ఈస్ట్రన్ కమాండ్ అధీనంలో ఉంది. దీన్ని రక్షణ అవసరాలకు ఎక్కువగా ఉపయోగించేవారు. సివిల్ ఏవియేషన్ ట్రాఫిక్‌కు కూడా పర్మిషన్ ఇచ్చారు. కొద్ది రోజుల కిందట.. ఇరవై నాలుగు గంటలూ విమానాల రాకపోకలకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాఖకు ఎయిర్‌ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు హఠాత్తుగా.. కేంద్ర రక్షణ శాఖ… విమానాల రాకపోకలు సాగించే సమయంపై.. ఆంక్షలు విధించింది. దీంతో సహజంగాే… దీనికి కారణమేమిటన్నదానిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలోనే… కశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. కశ్మీర్లో లేనిపోని ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా… మిలిటెంట్లపై దాడుల పేరుతో పాకిస్థాన్‌పై ఓ మాదిరి యుద్దం చేయడం ద్వారా.. దేశ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి… ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంలో బీజేపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. యుద్ధ సన్నాహాల కోసమే… విశాఖ ఎయిర్‌పోర్టును.. సిద్ధం చేసేందుకే.. విమానాల రాకపోకలను పరిమితం చేస్తున్నారన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
కారణం ఏమిటన్నదానిపై.. రక్షణ శాఖ వర్గాలు నోరు మెదపడం లేదు. కానీ విశాఖ విమానాశ్రయాన్ని మాత్రం మెల్లగా.. సివిల్ ఏవియేషన్ నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం నిజం. భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పుడీ ఎయిర్‌పోర్టు విషయంలోనూ రక్షణ శాఖ.. ఇబ్బంది పెడితే.. అది విశాఖకు చాలా మైనస్ అవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత.. విశాఖ సిటీ ఇప్పుడిప్పుడే మెట్రో పాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతోంది. దేశవిదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు.. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వచ్చిపోతున్నారు. పర్యాటకుల పరంగానూ… అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు విమాన ప్రయాణాల చిక్కులు ఏర్పడితే.. మళ్లీ పరిస్థితి మొదటికిక వస్తుందనే భావన విశాఖ వాసుల్లో ఉంది.
సహజంగానే… ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తోందనే అంచనాలు వస్తాయి. సామాన్య ప్రజల్లో ఇదే భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. విశాఖ ఎయిర్‌పోర్టు నేవీదని.. ప్రజలు ఎవరూ ఇప్పుడు భావించడం లేదు. అది ప్రజల అవసరాల కోసమేననుకుంటున్నారు. ఇప్పుడు కాదు..కూడదంటే.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించడానికి ఏపీ ప్రజలకు మరో కారణం దొరుకుతుంది అంతే.. !