నిన్నా మొన్నటి వరకూ శంకర్ ‘రోబో 2’కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తెలుగులో కొంతమంది నిర్మాతలు రోబోని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. దాదాపు రూ.50 కోట్ల వరకూ వెచ్చించడానికి చూశారు. కానీ.. బేరాలు కుదర్లేదు. దాంతో పాటు ‘రోబో’ ఆలస్యం అవుతూ వెళ్తుండంతో.. ‘రోబో’ లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. ఈలోగా ‘కాలా’ వచ్చి ‘రోబో’ వ్యాపారంపై దెబ్బకొట్టింది. రజనీ సినిమాలపై అంచనాలన్నీ ‘కాలా’ తలకిందులు చేసింది. నిజానికి ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి ఆశలూ లేవు. ‘కబాలి’ ఎఫెక్ట్‌తో ‘కాలా’ని కొనడానికి భయపడ్డారు. అయితే.. వసూళ్లు మరీ ఇంత దారుణంగా ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలసి కనీసం 9 కోట్లు కూడా రాలేదు. దాంతో బయ్యర్లు బాగా నష్టపోయారు. ‘రోబో’ రేట్లు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. `కాలా`తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ పలకొచ్చు. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే రూ.400 కోట్లు పెట్టింది చిత్రబృందం. దానికి తగ్గట్టే.. రేట్లు ఆకాశానికి తాకుతాయి. ‘కబాలి’, ‘కాలా’ల ఎఫెక్ట్ కచ్చితంగా ‘రోబో’పై పడుతుంది. ‘కాలా’ని అమ్మినట్టు ‘రోబో’ని అమ్మలేరు. వాళ్లు చెప్పిన రేట్లకు సినిమాని కొనలేరు. ‘కాలా’తో పోలిస్తే.. `రోబో 2` ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. అందులో సందేహం లేదు. కానీ సినిమా అటూ ఇటూ అయితే… రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అవుతాయి. అందుకే ‘రోబో 2’ని కొనడానికి బయ్యర్లు అంత ధైర్యం చేయకపోవొచ్చు. పైగా మూడేళ్లుగా ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. శంకర్ తీసిన ‘ఐ’, ‘త్రీ ఈడియట్స్’ ఫ్లాపులయ్యాయి. ఓ విధంగా ఆయన టైమూ బాగోలేదు. ‘రోబో’కి ముందు ‘కాలా’ లాంటి సినిమా చేయడం నిజంగా రజనీకాంత్ చేసిన సాహసం. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు.