చిత్రసీమలో హిపోక్రసీ ఎక్కువ. `నేనే గొప్ప` అనుకునే రకాలు కోకొల్లలుగా దొరికేస్తారు. ఏమోత్రం మొహమాటం లేకుండా పక్క సినిమాల నుంచి కాపీ కొట్టేసి – `ఇదంతా నా క్రెడిట్టే సుమా.. ఎవ్వరికీ ఇవ్వను` అనే టైపులో మాట్లాడతారు. అయితే ఎక్కడో ఓ చోట ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకులు కనిపిస్తారు. సెన్సిబుల్ డైరెక్టర్‌గా ఇంద్రగంటికి మంచి పేరుంది. హ్యూమర్‌ని ఆయన భలే తెరకెక్కిస్తారు. ఆయన్ని జూ. జంథ్యాల అనేవాళ్లూ ఉన్నారు. `సమ్మోహనం`తో ఆయన మార్క్ మరోసారి బయటపడింది. `ఆహా.. ఓహో` అంటూ ఈ సినిమాని పొగడ్తలతో ముంచేస్తున్నారు. దానికి తోడు బాక్సాఫీసు దగ్గర కూడా మంచి రిజల్ట్ దక్కించుకుంది. అయితే.. ఈ సినిమా కథ రాసుకోవడానికి స్ఫూర్తినిచ్చింది మాత్రం `పెళ్లి చూపులు` సినిమా అట. ఈ విషయాన్ని ఇంద్రగంటి చెప్పారు.
పెళ్లిచూపులు తనకిష్టమైన చిత్రాల్లో ఒకటని, అందులో ఓ సీన్ చూసి, ఇలాంటి కథ మనం కూడా రాసుకుంటే బాగుంటుంది కదా అని భావించానని, దాన్నే స్ఫూర్తిగా తీసుకుని `సమ్మోహనం` కథ తయారు చేసుకున్నానని ఇంద్రగంటి స్వయంగా చెప్పాడు. తరుణ్ భాస్కర్‌కి ఇది నిజంగా గొప్ప కాంప్లిమెంట్. తరుణ్‌తో పోలిస్తే.. ఇంద్రగంటి చాలా సీనియర్. ఆయన చేతిలో చాలా హిట్లున్నాయి. అలాంటిది ఎలాంటి హిపోక్రసీకి పోకుండా.. మరో దర్శకుడి సినిమానే తనకు స్ఫూర్తి అని చెప్పడం ఇంద్రగంటికే చెల్లింది.