ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు! జగన్ ప్రేమలో మోడీ పడ్డారనీ, మోడీ ప్రేమలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్ కి భాజపా అంటే ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. విశాఖకు రైల్వే జోన్, అమరావతికి నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ.. ఇలా ఏ అంశం తీసుకున్నా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదన్నారు. అలాంటి కేంద్రాన్ని జగన్ వెనకేసుకుని రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకున్నా నష్టం లేదనీ, కానీ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చెయ్యొద్దని అన్నారు.
ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది లేకపోవడం దురదృష్టకరమన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ తామేనని సోమిరెడ్డి చెప్పారు. జగన్ రోడ్డుమీద పోతూ, క్యాట్ వాక్ చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడానికే ఆయనకి సరిపోతోందన్నారు. జగన్ మీద 12 కేసులున్నాయనీ, నెల్లూరు జిల్లాలోని ఆయన అనుచరులపై ఒక్కొక్కరిపైనా ఏడేసి కేసులున్నాయన్నారు. శాసన సభకి రానివాళ్లు ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎలా పోటీ చేస్తారంటూ నిలదీశారు. ప్రజల తరఫున అసెంబ్లీకి రాని వైకాపా, రేప్పొద్దున్న ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే అర్హత కోల్పోయిందని సోమిరెడ్డి విమర్శించారు.
వైకాపా, భాజపా మిలాకత్ కు సంబంధించి అధికార పార్టీ చేస్తున్న విమర్శల్ని ప్రతిపక్ష పార్టీ బలంగా తిప్పికొడుతున్న సందర్భాలే లేవు. దీన్ని తిప్పికొట్టకుండా… కొన్ని అంశాల్లో భాజపా, టీడీపీ కుట్ర చేస్తున్నాయనీ, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకున్నాయని రెండు పార్టీలను కలిపి విమర్శిస్తారు. మరికొన్ని అంశాల్లో కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారు. ఇదే తరహాలో ఒక్క భాజపాని టార్గెట్ చేసుకుని విమర్శించే సందర్భాలే ఉండవు! అలాగని, భాజపాకి దూరంగా ఉంటున్నట్టైనా కనిపిస్తున్నారా అంటే.. అదీ లేదు! ఎన్నికల ముందు పొత్తు ఉండదని ఈ రెండు పార్టీలూ ఎవరికివారు ప్రకటనలు చేస్తున్నా… ఎన్నికల తరువాత కలుస్తారనే ఒక స్థాయి నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నది వాస్తవం.