ఏపీలో భాజపా, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా వేర్వేరు పార్టీలు కాదు కదా! అలాంటప్పుడు, ఏపీ సర్కారు అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఈ సవాళ్లు ఎందుకు… నేరుగా కేంద్రమే చర్యలకు దిగే అవకాశం ఉన్నప్పుడు..? ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి అవినీతీ అవినీతీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అవాస్తవాలనీ, కేంద్రం నుంచి నిరంతరం అత్యధిక నిధులు తీసుకుంటూనే.. కేంద్రంపైనా, ప్రధాని నరేంద్ర మోడీపై ఒక విష ప్రచారం ఆంధ్రాలో జరుగుతోందని విమర్శించారు. తన రాజకీయ అనుభవంలో ఇంతకంటే దిగజారుడు రాజకీయాన్ని చూడలేదన్నారు!
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చెయ్యలేదన్నారు. కేంద్రం అడిగినా ముందుకు రాకుండా, మెకాన్ సంస్థకు సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారని కన్నా అన్నారు! ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి లేఖ విడుదలైనా కూడా రాష్ట్రం స్పందించలేదని విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతి పుట్టా, అవినీతి చిట్టా అని ఆరోపించారు. ‘ఆఖరికి అవినీతి ఏ స్థాయికి దిగజారిందంటే.. నీరు చెట్టు అవినీతి, పంటగుంటలు అవినీతి, గృహ నిర్మాణ కార్యక్రమం అవినీతి, మరుగుదొడ్లు అవినీతి, ఇసుకలో కుంభకోణం, మట్టిలో కుంభకోణం. నీటిపారుదల ప్రాజెక్టుల్లో తీవ్రమైన అవినీతి’ అంటూ కన్నా చెప్పారు. ఇది వింటుంటే, టెంపోలో కాస్త తేడా ఉందిగానీ.. విపక్ష నేత జగన్ చేస్తున్న విమర్శల్లానే అనిపిస్తోంది కదా! ఏపీలో ప్రతీ రూపాయీ కేంద్రమే ఇచ్చిందనీ, అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని కన్నా సంసిద్ధత వ్యక్తం చేశారు.
అవినీతి నిరూపించడానికి సిద్ధంగా ఉండటం అంటే, ఆధాలున్నాయని చెప్పడమే కదా! అదేదో నేరుగా కేంద్రానికే నివేదిస్తే సరిపోతుందిగా. కేవలం ప్రెస్ మీట్లలో మాత్రమే ఎందుకీ చర్చలు, కేంద్రం చర్యలు దిగితే నిరూపణ అవుతుంది. జీవీఎల్, రాం మాధవ్, కన్నా, సోము వీర్రాజు.. వీరందరూ ప్రతీరోజూ ఏపీ అవినీతి గురించే మాట్లాడతారుగానీ… ఏ ఒక్కరూ, ఏ ఒక్క ప్రెస్ మీట్ కి కూడా ఏ చిన్న ఆధారంతో వస్తున్న దాఖలాలే ఉండటం లేదు. జగన్ చెప్పినట్టు ఇసుక నుంచి మట్టిదాకా అంటూ మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు కదా! జగన్ ఆరోపణల విషయంలో ఎలా లైట్ తీసుకుంటున్నారో.. ఇప్పుడు భాజపా నేతల వ్యాఖ్యల్నీ రానురానూ పట్టించుకోవడం మానేస్తారు!