యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మరణంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడి తన మౌనం వీడారు. భరతమాత ఒక ముద్దు బిడ్డను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. కానీ ఆ మాట చెప్పడానికి ఆయనకి ఇన్నిరోజులు ఎందుకు పట్టిందో తెలియదు. రోహిత్ మృతికి నిజంగా ఆయన బాధపడుతున్నట్లయితే, అతను ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి మాట్లాడి అందుకు బాధ్యులు అయినవారిని శిక్షిస్తానని ఒక మాట చెప్పి ఉంటే ఆయన చాలా ఆలస్యంగా స్పందించినా ఆయన మాటలకు విశ్వసనీయత ఏర్పడి ఉండేది. కానీ ఆయన ఆ విషయమే ప్రస్తావించలేదు.
అందుకే “ఆయన మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని” కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. “రోహిత్ మృతి గురించి ఆయన ఎంత భావోద్వేగం ప్రదర్శించినా..ఎంత నాటకీయంగా మాట్లాడినా, అతని చావుకి కారకులయిన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తత్రేయాలపై చర్యలు తీసుకొంటానని హామీ ఇవ్వలేకపోవడం గమనిస్తే ఆయన ప్రజలను మభ్యపెట్టేందుకే మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని అర్ధం అవుతోందని” కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా అన్నారు. “ఆయన మొసలి కన్నీళ్లు కార్చినంత మాత్రాన్న చనిపోయిన రోహిత్ తిరిగి రాడు. దాని వలన దళితులకు న్యాయం జరగదు కూడా. కనుక కనీసం అతనికి, అతని తల్లికి న్యాయం చేయాడానికయినా కేంద్రమంత్రులిద్దరినీ తక్షణమే పదవులలో నుండి తొలగిస్తానని చెప్పి ఉండాల్సింది,” అని రణదీప్ సుర్జీవాలా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కపిల్ సిబాల్, ముకుల్ వాస్నిక్ వంటి కొంత మంది సీనియర్ నేతలు కూడా మోడీ స్పందనపై ఇంచు మించు అదేవిధంగా ప్రతిస్పందించారు.
రోహిత్ విషయంలో మోడీ ఇంతవరకు స్పందించకపోవడం, స్పందించినా భాద్యులపై చర్యలు తీసుకొంటానని చెప్పకపోవడం ఆయన చిత్తశుద్దిని శంఖించేలా చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే ఈ వ్యవహారంలో మోడీ ప్రభుత్వాన్ని ఎంతో కొంత రాజకీయంగా దెబ్బ తీయాలనే ఆత్రుత వారి మాటల్లో కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారికి రోహిత్ కి న్యాయం చేయడం కంటే ఈ వ్యవహారం అడ్డం పెట్టుకొని ఇద్దరు కేంద్రమంత్రులని ఎలాగో ఒకలాగ బయటకి పంపాలనే తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోంది. తద్వారా మోడీ ప్రభుత్వం తప్పు చేసిందని రుజువు చేయడానికి వీలవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచన కావచ్చును.
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినప్పటి నుంచి వారిలో ఈ తాపత్రాయం బాగా పెరిగిపోయింది. అందుకే ఇటువంటి అవకాశాలను వారు ఎన్నడూ వదులుకోలేదు. వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, దళిత బాలల దహనం కేసులో రక్షణ శాఖ సహాయమంత్రి వికె సింగ్, ఇప్పుడు రోహిత్ వ్యవహారంలో బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీల రాజీనామాలకు పట్టుబడుతున్నారు. రాజకీయాలలో ఇటువంటివి చాలా సహజమే అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడి రోహిత్ విషయంలో మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని ఎద్దేవా చేస్తున్న కాంగ్రెస్ నేతలు కూడా అదే పని చేస్తున్నారు. రోహిత్ కి చాలా అన్యాయం జరిగిందని మొసలి కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఏమి చేయాలి? అతని కుటుంబానికి ఏవిధంగా సహాయపడాలి? వంటి విషయాల గురించి మాట్లాడకుండా ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా కోసమే గట్టిగా మాట్లాడుతుండటం, మోడీని విమర్శిస్తుండటం గమనిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఒక్క తానులో ముక్కలేనని అర్ధమవుతుంది.
కొస మెరుపు: ఈ వ్యవహారంలో ప్రధాన దోషిగా చెప్పబడుతున్న యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ ప్రొఫెస్సర్ అప్పారావుని ఆ పదవిలో నుండి తప్పించకమునుపే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇన్స్టిట్యూట్స్ కి యాక్టింగ్ చైర్ పర్సన్ గా మానవ వనరుల అభివృద్ధి శాఖ నియమించినట్లు తాజా సమాచారం.