వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ప్రత్యేకహోదా కోసం పదవులు పూచిక పుల్లల్లా త్యాగం చేశామని ఎంపీలు ప్రకటించేస్తున్నారు. తమ త్యాగాన్ని గుర్తించాలని వారు ప్రజల్లోకి కూడా వెళ్లాలనుకుంటున్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం లేదని నిందలేస్తున్నారు. అసలు ఈ ఐదుగురు రాజీనామాలు చేయడం వల్ల ఏం వస్తుంది..? ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంలో కదలిక వస్తుందా..? కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందా..? లేక ఉపఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుందా..? అంటే… దేనికీ లేదనే సమాధానం చెప్పుకోవాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపఎన్నికలు రావు. బీజేపీతో ఒప్పందం చేసుకుని ఉపఎన్నికలు రాకుండా.. రాజీనామాలు ఆమోదించుకున్నారన్నది.. చిన్నపిల్లవాడికి కూడా తెలిసే నిజం. ఎంపీలు ఎన్ని మాటలు చెప్పినా… వీటోనే. ఇక వీరి రాజీనామాల వల్ల కేంద్రంపై ఏమైనా ఒత్తిడి పెరుగుతుందా..? వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినంత మాత్రాన.. కేంద్రంపై పెరిగే ఒత్తిడి ఏమీ లేదు. ఎందుకంటే.. బీజేపీతో కలిసి.. వైసీపీనే.. గేమ్ ఆడుతోందన్న అభిప్రాయం.. ఒక్క ఏపీలోనే కాదు..దేశం మొత్తం తెలిసింది. ఇద్దరూ కలిసి రాజీనామాల వ్యవహారం నడిపినప్పుడు బీజేపీపై ఒత్తిడి అనే ప్రశ్న ఎలా వస్తుంది.
అసలు వైసీపీ ఎంపీల రాజీనామాల ద్వారా ఒత్తిడి చేసి..టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించాలనేది…బీజేపీ ఎత్తుగడ అని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే… వైసీపీ, బీజేపీ నేతలు.. టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయరంటూ.. సవాళ్లు కూడా చేశారు. కానీ టీడీపీ వైసీపీ ట్రాప్‌లో పడలేదు. ఏపీ ఎంపీలతో బీజేపీ రాజీనామాలు చేయించాలనుకోవడం వెనుక ఉన్న ముఖ్యకారణం ఆగస్టు పార్లమెంట్ సమావేశాలు. గత పార్లమెంట్ సమావేశాలను ఇతర పార్టీల సాయంతో.. టీడీపీ స్తంభింపచేసింది. అప్పుడే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టలేక కేంద్రం విమర్శల పాలయింది. ఆగస్టులోనూ టీడీపీ వదిలి పెట్టే అవకాశం లేదు. అందుకే వైసీపీ ఎంపీల రాజీనామాల ద్వారా ఒత్తిడి తెచ్చి.. వారినీ రాజీనామాల ట్రాప్‌లోకి లాగుదామనుకున్నారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో… కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వైసీపీ ఎంపీలు చేజేతులా పోగొట్టుకున్నారు., అంటే బీజేపీకి ప్రత్యక్షంగా మేలు చేశారు.
ఏ విధంగా చూసినా.. వైసీపీ ఎంపీల రాజీనామాలు.. ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం మేలు చేసేవి కావు. పైగా మరింత హాని చేసేవిగా భావించాల్సి ఉంటుంది. తమ రాజీనామాల వల్ల.. ఫలానా ఉపయోగం అని.. వైసీపీ ఎంపీలెవరైనా ధైర్యంగా ప్రకటించుకునే పరిస్థితి లేకపోవడమే దీనికి సాక్ష్యం.